కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తిరిగి జీవం పోయడానికి ఉద్దేశించిన భారీ ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా చితికిపోయిన వలస కార్మికులు, చిరు వ్యాపారులు, సన్నకారు రైతులను ఆదుకోవడమే ప్రధాన అజెండాగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం 9 విభాగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
లాక్డౌన్ కారణంగా సరైన పని దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఊరట కలిగిస్తూ పలు చర్యలు ప్రకటించారు ఆర్థిక మంత్రి. పట్టణాల్లో ఇళ్లు లేని పేదలకు అండగా ఉంటామన్నారు. వారి పట్ల కేంద్రం పూర్తి శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో గత రెండు నెలల నుంచి.. రోజూ మూడు పూటల భోజనం అందిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దీనికయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రేషన్ ఉచితం
రానున్న 2 నెలలపాటు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేకపోయినా ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందిస్తామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి 3 నెలలపాటు ఉచితంగా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలే నిత్యవసరాలను అందజేస్తాయని నిర్మల వివరించారు. దీనికయ్యే మొత్తం ఖర్చు రూ. 3,500 కోట్లు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.
వన్ నేషన్-వన్ రేషన్
ఆగస్టు నుంచి 'ఒకే దేశం- ఒకే రేషన్' కార్డు విధానం అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఫలితంగా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ వెసులుబాటు వల్ల స్వస్థలాలను వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
పట్టణ పేదలకు ఆవాసం
వలస కార్మికులు, పట్టణ పేదల కోసం కొత్త పథకం ద్వారా చౌకగా అద్దె ఇళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.
సన్నకారు రైతులకు అండ
చిన్న, సన్నకారు రైతులు సరైన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. వారందరికీ కేంద్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కిసాన్ కార్డుదారులకు ఇప్పటికే రూ.25వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.