ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఐదో, ఆఖరి విడత ప్యాకేజీని ప్రకటించారు. స్వావలంబనే లక్ష్యంగా ఇప్పటికే పలు రంగాలకు ఉద్దీపనలు ప్రకటించిన ఆమె.. ఈ రోజు ఏడు కీలక రంగాల కోసం నిర్దేశించుకున్న సంస్కరణల ప్రణాళికను వెల్లడించారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపార రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. అలాగే సరళతర వాణిజ్యం, కంపెనీల చట్టం, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విషయంలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు చేయూతనిస్తామని ఆమె పేర్కొన్నారు.
సంక్షోభంలోనే అవకాశాలు
కరోనా సంక్షోభంతో పాటు అవకాశాలను కూడా చూపించిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలని ప్రధాని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని అమె తెలిపారు. ఆర్థికమంత్రి చెప్పిన వివరాలు..
- గరీభ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు అందిస్తున్నాం. అలాగే వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ చేశాం. సాంకేతిక పరమైన సంస్కరణలు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైంది.
- ప్రధానమంత్రి కిసాన్ యోజన, సంక్షేమ పింఛన్ల రూపంలో వేల కోట్లు బదిలీ చేశాం. 20 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లోకి గరీభ్ కల్యాణ్ యోజన కింద నగదు బదిలీ చేశాం. భవన నిర్మాణ ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశాం.
- 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.3660 కోట్ల నగదు వెనక్కు తీసుకునందుకు అవకాశం కల్పించాం. మూడు నెలలపాటు పేదలకు ఉజ్వల పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందిస్తాం.
- సాంకేతిక విప్లవం సాయంతో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం.
- ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు పంపుతున్నాం. ఇందుకయ్యే ఖర్చులో 85 శాతం కేంద్రం.. 15 శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయి.
ఇదీ చూడండి:దేశంలో కరోనా కొత్త రికార్డ్- ఒక్కరోజులో 4987 కేసులు