తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త పన్ను శ్లాబులు... ఉద్యోగులకు ఊరటనివ్వలేదు

ఆదాయ పన్ను భారం తగ్గుతుందని గంపెడాశతో ఎదురుచూసిన ప్రజలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరుత్సాహాన్ని మిగిల్చారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని వీక్షిస్తున్న వారికి ఆర్థిక మంత్రి కొత్త ఆదాయ పన్ను శ్లాబులు వెల్లడించగానే... పన్ను భారం భారీగా తగ్గుతుందనే అభిప్రాయం కలిగింది. కానీ... కొత్త, పాత శ్లాబులు రెండూ కొనసాగుతాయనీ, కొత్త శ్లాబులను ఎంచుకుంటే... మినహాయింపులు వర్తించబోవని ఆమె ప్రకటించగానే ఉసూరుమన్నారు.

new tax slabs cannot give any benefits to the employees
కొత్త పన్ను శ్లాబులు... ఉద్యోగులకు ఊరటనివ్వలేదు

By

Published : Feb 2, 2020, 6:24 AM IST

Updated : Feb 28, 2020, 8:38 PM IST

ఆదాయపు పన్ను శ్లాబులు

ఆరు నెలల క్రితం మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించి, వ్యాపార సంస్థలకు మేలు చేసింది. అదేస్థాయిలో ప్రస్తుత బడ్జెట్‌లోనూ వ్యక్తులు, అవిభాజ్య కుటుంబాలపై ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందని అంతా ఆశించారు. అయితే... ఉపశమనం కల్గించే ఎలాంటి ప్రతిపాదనా కన్పించలేదు. అంతకుముందున్న మూడు శ్లాబులకు బదులుగా ఏడు శ్లాబులను తీసుకొచ్చారు. అదే సమయంలో పాత విధానమూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కొత్త శ్లాబులను వాడుకుంటే ఎలాంటి మినహాయింపులు వర్తించబోవని మెలిక పెట్టారు. దీంతో... పాత పద్ధతిలో మినహాయింపులు తీసుకొని, పన్ను చెల్లించడం మేలా.. ఎలాంటి మినహాయింపులు లేని కొత్త విధానాన్ని అనుసరించడం మేలా అనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ప్రస్తుతం 100కు పైగా మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు సెక్షన్‌ 80సీ కింద... ఉద్యోగ భవిష్య నిధి, జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణంలో అసలు వంటివి ఉన్నాయి. ఇంటి అద్దె భత్యం, గృహరుణంపై చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకం, విద్యా రుణానికి చెల్లించే వడ్డీ, సేవా సంస్థలకు ఇచ్చే విరాళాలపై మినహాయింపులనూ క్లెయిం చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల మినహాయింపులతో ఆదాయపు పన్ను గణన, రిటర్నుల సమర్పణ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.

రిటర్నుల దాఖలుకు తప్పనిసరిగా నిపుణుల మీద ఆధారపడాల్సిన పరిస్థితీ వస్తోంది. దశాబ్దాల నాటి ఈ ప్రక్రియను సమీక్షించాల్సిన అవసరం ఉందని భావించి, ఈసారి కొన్ని మార్పులను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మిగిలిన వాటినీ భవిష్యత్తులో సమీక్షించి, పరిస్థితులకు అనుగుణంగా తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆమె తెలిపారు. అంటే... సరళీకృత పన్ను విధానాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇది బాగానే ఉన్నప్పటికీ ప్రజలపై పన్ను భారమైతే ప్రస్తుతానికి తగ్గుతున్నట్లుగా లేదు.

ఎవరికి ఏది లాభం?

ఎవరికి ఏది లాభం

ప్రస్తుతం ఎటువంటి మినహాయింపులు కోరని వారికి కొత్త శ్లాబులు ప్రయోజనకరంగానే కనిపిస్తున్నాయి. కానీ, ప్రామాణిక తగ్గింపు రూ.50 వేలు, సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000, గృహరుణంపై వడ్డీ రూ.2లక్షలు, ఆరోగ్య బీమా ప్రీమియం, ఇంటి అద్దె వంటి మినహాయింపులు తీసుకునే వారికి మాత్రం పాత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించడమే మేలని స్పష్టమవుతోంది. ఉద్యోగులకు భవిష్య నిధి ఉంటుంది. పిల్లల ట్యూషన్‌ ఫీజులు, జీవిత, ఆరోగ్య బీమాలవంటివి సర్వసాధారణం. కాబట్టి, వారికి కొత్త శ్లాబులతో పెద్దగా ఉపయోగం ఉండదు.

  • కొత్త పద్ధతిలో కొన్ని మినహాయింపులను కొనసాగించారు. పాత విధానంలో ఉన్న సెక్షన్‌ 80సీసీడీ (జాతీయ పింఛను పథకం) కింద ఉన్న రూ.50,000 మినహాయింపు పరిమితిని, కొత్త పద్ధతిలోనూ కొనసాగించారు. దీంతోపాటు ఉద్యోగులకు ఇచ్చే రోజువారీ ప్రయాణ ఖర్చులు, బదిలీ సందర్భంగా ఇచ్చే రవాణా ఖర్చు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అయిన ప్రయాణ ఖర్చులను మినహాయింపుల నుంచి తొలగించలేదు. అయితే... ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే ఉచిత ఆహార కూపన్లకు ఉన్న మినహాయింపును తీసేశారు.
  • స్థిరాస్తి అమ్మకాల్లో నమోదు చేసిన విలువ ప్రస్తుత నిబంధనల ప్రకారం 5% వరకు వ్యత్యాసాన్ని అనుమతిస్తారు. దీన్ని కొత్త బడ్జెట్‌లో 10 శాతానికి పెంచారు.
  • ప్రస్తుత నిబంధనల ప్రకారం... ‘ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీఎస్‌)’ను వినియోగించుకున్న సంవత్సరంలోనే పన్ను చెల్లించాల్సి ఉంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఇకపై 4ఏళ్ల తర్వాత, అమ్మినప్పుడు, ఉద్యోగి ఆ సంస్థను వదిలి వెళ్లినప్పుడు... వీటిలో ఏది ముందైతే అప్పుడు పన్ను చెల్లించాలని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నారు.
    నిర్మలా సీతారామన్​

మినహాయింపులు కోరితే...

ఇక రూ.15 లక్షలు ఆదాయం ఉన్న ఒక వ్యక్తి సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2 లక్షలు సెక్షన్‌ 80డీ కింద రూ.25 వేలు, ప్రామాణిక తగ్గింపు రూ.50 వేలు మినహాయింపు తీసుకున్నాడనుకుందాం. అప్పుడు మినహాయింపుల మొత్తం రూ.4,25,000 అవుతుంది. దీంతో పన్ను వర్తించే ఆదాయం రూ.10,75,000లకు చేరుతుంది.

ఆదాయం - పన్ను

నికర పన్ను రూ.1,35,000. దీనికి 4 శాతం సెస్సు కలిపితే.. పన్ను మొత్తం రూ.1,40,400అవుతుంది. అంటే.. మినహాయింపులు కోరితే.. కొత్త పద్ధతిలో చెల్లించే రూ.1,95,000లతో పోలిస్తే.. పాత పద్ధతిలో చెల్లించే పన్ను రూ.1,40,400. అంటే, పాత పద్ధతి ప్రకారం పన్ను చెల్లిస్తే..రూ 54,600 మిగులుతాయి.

పన్నుల్లో తేడాలు

- జి.సాంబశివరావు, ప్రత్యక్ష పన్నుల నిపుణులు

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: ఆప్​లో 25%, భాజపాలో 20% మంది నేరచరితులు

Last Updated : Feb 28, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details