ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్(Online Banking) నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ చిన్న పని కోసమైనా.. ఆన్లైన్ ద్వారానే(net banking) డబ్బులు చెల్లిస్తున్నాం. అయితే.. పొరపాటున వేరే బ్యాంకు ఖాతాకు మనీ ట్రాన్స్ఫర్ అయితే ఎలా? అలా వెళ్లిన డబ్బును తిరిగి పొందగలమా? అందుకు ఏం చేయాలి?
ఇతర బ్యాంకు ఖాతాకు డబ్బులను ఆన్లైన్ ద్వారా(net banking) పంపుతున్నప్పుడు పొరపాటున మనకు తెలియని వేరే ఖాతాలోకి వెళితే అది పెద్ద సమస్యే. అలా జరిగిన వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఒకసారి డబ్బులు బదిలీ అయితే, అవతలి వ్యక్తి అనుమతి లేకుండా తిరిగి తీసుకోవటం అసాధ్యం. అందుకే.. నగదు పంపుతున్నప్పుడు లబ్ధిదారుడి పూర్తి వివరాలను ఇవ్వటం చెల్లింపుదారు బాధ్యతగా ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
పొరపాటు జరిగితే ఏం చేయాలి?
- పొరపాటున వేరే ఖాతాకు డబ్బును పంపినట్లయితే.. వెంటనే మీ బ్యాంకు, స్థానిక బ్యాంకు మేనేజర్‌కు సమాచారం అందించాలి. అలాగే.. లావాదేవీ జరిగిన సమయం, పొరపాటున డబ్బులు జమ అయిన ఖాతా, ఎవరికైతే పంపాలనుకున్నామో వారి ఖాతా వంటి పూర్తి వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి.
- బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరించి.. ఏ ఖాతాకు డబ్బు జమ అయితే ఆ బ్యాంకుతో సంప్రదింపులు చేస్తుంది. బ్యాంకు సాయంతో తమ నగదును తిరిగి పంపాలని వారిని మీరు కోరవచ్చు. అదే బ్యాంకులో డబ్బులు పొందిన వ్యక్తి ఖాతా ఉంటే.. తిరిగి పంపించాలని కోరుతుంది. అతను అంగీకరిస్తే.. వెంటనే ఖాతాకు నగదు బదిలీ చేస్తుంది.
- బ్యాంకుకు పూర్తి సమాచారం ఇవ్వటం చాలా అవసరం. అలాగే.. పొరపాటున జరిగిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తే త్వరగా మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు.. మన నగదు పంపించేందుకు అవతలి వ్యక్తి అంగీకరించకపోతే, లీగల్‌గా చర్యలు తీసుకోవచ్చు. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది.
పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- డబ్బులు పంపాల్సిన వ్యక్తి బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబర్ వంటి సరైన వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. లావాదేవీ జరిపే ముందే ఒకటికి రెండు సార్లు వివరాలను తనిఖీ చేసుకోవాలి.
- పెద్ద మొత్తంలో డబ్బులు పంపే ముందు.. సరైన వ్యక్తికే చేరుకున్నాయా? అని తెలుసుకోవాలి. అందుకు ముందుగా చిన్న మొత్తంలో పంపి తనిఖీ చేసుకోవాలి. రూ.లక్షల కన్నా.. రూ.100ను వెనక్కి తెచ్చుకోవటం చాలా సులభం కదా..!
- మీ ఖాతా ఉన్న బ్యాంకు ఫోన్ నంబర్ వంటి కాంటాక్ట్ వివరాలను దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ పొరపాటు జరిగితే.. తొందరగా వాటిని పొందగలిగేలా చూసుకోవాలి. బ్యాంకుకు త్వరగా సమాచారం అందితే.. నగదు జమ అయిన ఖాతా వివరాలను వీలైనంత తొందరగా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అది మన డబ్బును తిరిగి పొందేందుకు సాయపడుతుంది.
ఇదీ చూడండి:Petrol Price: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు