కేంద్ర రహదారి, రవాణాశాఖ వాహనాల విషయంలో శుక్రవారం ఒకే రోజు మూడు సంస్కరణలను ప్రతిపాదించింది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, బీమాలకు ఉన్న నామినీ సౌకర్యాన్ని ఇప్పుడు వాహనాలకూ వర్తింపజేస్తూ కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టింది. పురాతనమైన వింటేజ్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు నూతన నిబంధనలను తెర మీదకు తెచ్చింది. ఓలా, ఉబెర్‌లాంటి క్యాబ్ అగ్రిగేటర్లను నియంత్రించడానికి కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మూడింటి ముసాయిదాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది.
1. సులువుగా వాహనాల హక్కుల బదిలీ
వాహన యజమాని చనిపోతే దాని హక్కులు ఆటోమేటిక్‌గా నామినీకి వెళ్లే సౌకర్యం ఇప్పటి వరకూ లేదు. వాహన యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడానికి సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989లో మార్పులు ప్రతిపాదించారు.
- వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని తన నామినీని ప్రతిపాదిస్తే వారి తదనంతరం వాహనం సంబంధిత వ్యక్తి పేరుపైకి బదిలీ చేస్తారు.
- ఒకవేళ యజమాని చనిపోతే వారి మరణ ధ్రువపత్రాన్ని రిజిస్టరింగ్ అథారిటీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి వాహన హక్కులను తన పేరు మీద బదలాయించాలనినామినీ దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆధార్ ధ్రువీకరణ సౌకర్యాన్ని ఎంచుకుంటే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండానే యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి.
- విడాకులు, ఆస్తుల విభజన, ఆస్తుల బదిలీలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నామినీ పేర్లను మార్చడానికీ వెసులుబాటు ఉంది.