"ఓ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు"... ఇది ఒకప్పటి యువత మాట. ఈతరం యువత ఇందుకు పూర్తిగా భిన్నం. 'ఎన్ని కష్టాలెదురైనా, కన్న కలలు సాకారం చేసుకోవాల్సిందే..' అన్నది నేటి యువత మాట. ఇటీవలే ఓ టీవీ ఛానెల్ చేసిన సర్వేలో బయటపడ్డ విషయాలే ఇందుకు నిదర్శనం.
స్థిరమైన ఉద్యోగం సంపాదించడం కన్నా.. కలలు సాకారం చేసుకోవడంవైపే నేటి యువత మొగ్గుచూపుతున్నారని ఆ సర్వేలో తేలింది. 15-25ఏళ్లలోపు యువతలోని మూడింట రెండోవంతు.. తమ 'ప్యాషన్'పై దృష్టి సారించి, అందులో నుంచే డబ్బులు సంపాదించాలని అభిప్రాయపడుతున్నట్టు స్పష్టమేంది.
దేశవ్యాప్తంగా 23వేల మంది యువతపై ఈ సర్వే జరిగింది. ఇందులో 21శాతం మంది 'జెన్ జెడ్' యువత.. కలలు సాకారం చేసుకోవడమే జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా భావిస్తున్నట్టు తేలింది. 2016లో ఇది కేవలం 9శాతంగా ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం కోసం చేసే పనులతోనే పేరు ప్రఖ్యాతలు వస్తాయని 69శాతం మంది అభిప్రాయపడ్డారు. అదనపు ఆదాయం కోసం అభిరుచులవైపు వీరు మొగ్గుచూపుతున్నారు.
సర్వేలోని మరిన్ని విశేషాలు..
- కొవిడ్ సమయంలో డబ్బుకున్న ప్రాధాన్యత పెరిగింది. 2019లో ధనవంతులవ్వాలన్న కల 21శాతం మందికి ఉంటే.. ఇప్పుడది 46శాతానికి పెరిగింది.
- ఇప్పటివరకు ఎవరూ ఎంచుకోని, అన్వేషించని మార్గాల్లోనే ఎక్కువ సంపాదన వచ్చే అవకాశముందని మూడోవంతు యువత అభిప్రాయపడుతోంది.
- సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైగా మంది.. రిలేషన్షిప్లో ఉన్నా లాక్డౌన్లో ఇతరులతో సన్నిహితంగా మెలిగారు.
- యువతలో పెళ్లి అనే అంశంపై సదాభిప్రాయం తగ్గిపోతోంది. అసలు పెళ్లి అవసరమా? అన్న ఆలోచన పెరుగుతోంది. రెండేళ్ల ముందు ఇలా ఆలోచించే వారి సంఖ్య 8శాతం ఉండగా.. ఇప్పుడది 10శాతానికి పెరగడం గమనార్హం.
- వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది యువత టీవీ షోలవైపు మొగ్గుచూపుతున్నారు.
ఇవీ చూడండి:-