Money Saving Tips: పొదుపు చేయడానికి అప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులకు ఎప్పుడూ సొంత డబ్బులే వినియోగించాలని చెప్తున్నారు. ఇందుకోసం రుణం తీసుకొని పెట్టుబడులు పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
నా వయసు 24 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. రూ.75లక్షల టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 15 ఏళ్లపాటు నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?
- నరేశ్
మీపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు టర్మ్ పాలసీ తీసుకోవడం మంచి ఆలోచనే. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ పాలసీ మొత్తం ఉండేలా చూసుకోండి. ఈ మొత్తాన్ని విభజించి మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి తీసుకునేందుకు ప్రయత్నించండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ బీమా పాలసీలు ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే.. తప్పనిసరిగా తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా మదుపు చేయండి. కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.10వేలు మదుపు చేస్తూ వెళ్తే.. 12 శాతం రాబడి అంచనాతో దాదాపు రూ.44,73,565 మీ చేతికి వచ్చే వీలుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లండి.
వ్యక్తిగత రుణం తీసుకొని షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. రుణానికి 13 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి. స్టాక్ మార్కెట్లో దీనికన్నా అధిక మొత్తం వస్తుంది అని అంటున్నారు. నిజమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మహిపాల్
గత ఏడాదిన్నరగా స్టాక్ మార్కెట్ల పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ఈ సమయంలో మదుపు చేసిన వారికి మంచి లాభాలే కనిపించాయి. స్టాక్ మార్కెట్‌లో లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయని గమనించాలి. పెట్టుబడులకు ఎప్పుడూ సొంత డబ్బులే వినియోగించాలి. అంతేకానీ, రుణం తీసుకొని పెట్టుబడులు పెట్టడం సరికాదు. మీరు వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు వడ్డీతోపాటు ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివీ చెల్లించాలి. మొత్తానికి వడ్డీ రేటు 13 శాతానికి మించే ఉంటుంది ఈ డబ్బులు స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తే.. ఇంతకంటే అధిక రాబడి రావచ్చు.. లేదా పెట్టుబడి మొత్తం నష్టపోయే ఆస్కారమూ ఉంది. కాబట్టి, అప్పు తీసుకొని మదుపు చేసేకన్నా.. మీరు రుణానికి చెల్లించే ఈఎంఐ ఎంతో చూసుకొని, ఆ మొత్తాన్నే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు నెలనెలా కేటాయించండి. అయిదేళ్లకు మించి పెట్టుబడి కొనసాగించాలని అనుకున్నప్పుడే స్టాక్ మార్కెట్లో మదుపు చేయండి.