మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. సత్య నాదెళ్లకు పద్మభూషణ్ పురష్కారాన్ని ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయన స్ఫూర్తిమంతమైన జీవిత ప్రస్థానం మీ కోసం..
అంచెలంచెలుగా..
మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ-ఛైర్మన్ స్థాయికి చేరారుసత్యనాదెళ్ల. 2014లో ఆయన సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) బాధ్యతలు చేపట్టే నాటికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లలో మైక్రోసాఫ్ట్ పరిస్థితి గొప్పగా లేదు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉత్పత్తి (ఫ్లాగ్‌షిప్ ప్రోడక్ట్) అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితుల్లో సత్య నాదెళ్ల సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సత్వరం వృద్ధి సాధించే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్లు, కృత్రిమ మేధ (ఏఐ).. తదితర నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించారు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని పూర్తిగా నవీకరించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించారు. యాపిల్ ఐప్యాడ్‌కు ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేశారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకువచ్చారు. విండోస్ 9 వదిలేసి నేరుగా విండోస్ 10 ఆవిష్కరించారు. అజూరే క్లౌడ్‌లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ అనే ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ఫలితంగా కంపెనీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ (మార్కెట్ కేపిలైజేషన్) ఏడు రెట్లు పెరిగి రెండు లక్షల కోట్ల డాలర్లకు దగ్గరైంది. క్లౌడ్ కంప్యూటింగ్.. తదితర కొన్ని విభాగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విభాగంలో గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ అధిక ఆదాయాలు నమోదు చేసే స్థితికి ఎదిగింది. ఈ మార్పుల ఫలితంగా ఒక అగ్రశ్రేణి ఐటీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. త్వరలోనే విండోస్ 11ను ఆవిష్కరించనుంది.
కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్‌లో
కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు విక్రయించే సంస్థ అయిన సన్ మైక్రోసిస్టమ్స్‌లో తొలుత సత్య నాదెళ్ల పనిచేశారు. అక్కడి నుంచి 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అక్కడి నుంచి ఆయన ప్రగతి ప్రస్థానం శరవేగంగా సాగింది. ఆ మరుసటి ఏడాదే మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ ఉపాధ్యక్షుడు అయ్యారు. 2007లో మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ సర్వీసెస్‌కు సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమితుడై బింగ్, ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్.. తదితర ప్రాజెక్టులు పర్యవేక్షించారు. 2011లో సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధ్యక్షుడిగా అజూరే క్లౌడ్, విండోస్ సర్వర్, ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ వ్యవహారాలు చూశారు. సర్వర్ అండ్ టూల్స్ విభాగం ఆదాయాలను 16.6 బిలియన్ డాలర్ల నుంచి 20.3 బిలియన్ డాలర్లకు పెంచారు. 2014లో ఆయన్ను మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవి వరించింది. అప్పటి వరకు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ దిగిపోగా, ఆ స్థానాన్ని సత్య నాదెళ్లకు అప్పగించారు. ఇది బిల్ గేట్స్ తీసుకున్న నిర్ణయం అంటారు.