తెలంగాణ

telangana

ETV Bharat / business

'తయారీలో అంతర్జాతీయంగా భారత్ పోటీపడటం కష్టమే..కానీ' - భారత్ తయారీరంగం

స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా... తయారీరంగంలో అంతర్జాతీయంగా పోటీపడటం భారత్‌కు ఇప్పుడే సాధ్యం కాదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. పారిశ్రామికంగా పోటీపడేలా ఈ రంగాన్ని తీర్చిదిద్దలేకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. 'పోటీతత్వంపై భారత్‌కు మార్గదర్శకం' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

Maruti Suzuki Ceo about production department in India
'తయారీలో భారత్ అంతర్జాతీయంగా​ పోటీపడటం కష్టమే..కానీ'

By

Published : Jul 6, 2020, 6:38 AM IST

తయారీరంగంలో అంతర్జాతీయంగా పోటీపడటం భారత్‌కు ఇప్పుడే సాధ్యం కాదనే అభిప్రాయాన్ని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా, పారిశ్రామికంగా పోటీపడేలా తీర్చిదిద్దలేకపోవడమే ప్రస్తుత స్థితికి కారణమని వివరించారు. పేద-ధనిక అంతరం మరింత పెరుగుతోందని తెలిపారు. జీడీపీలో తయారీ రంగం వాటా 15 శాతమేనని, ఇందువల్ల సామాజిక అంతరాలు మరీ ఎక్కువయ్యాయని వివరించారు. అందరూ చేయిచేయి కలిపితే మాత్రం ప్రపంచానికి పోటీగా నాణ్యమైన ఉత్పత్తులను, పోటీ ధరలకే అందించగలమని 'పోటీతత్వంపై భారత్‌కు మార్గదర్శకం' పేరిట రాసిన పుస్తకంలో భార్గవ పేర్కొన్నారు. ప్రభుత్వమో లేక పరిశ్రమో ఒంటరిగా ఈ లక్ష్యాన్ని సాధించలేవన్నారు. 60 సంవత్సరాలుగా విధాన నిర్ణేత, పారిశ్రామిక నాయకుడిగా తనకు ఉన్న అనుభవంతో భార్గవ పలు సూచనలు చేశారు.

  • రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాలు, అధికార వ్యవస్థ (బ్యూరోక్రసీ), న్యాయవ్యవస్థ, పారిశ్రామిక నాయకులపై విశ్వాసం పెరగాలి. ఇందుకు పారిశ్రామిక దిగ్గజాలు ప్రధాన భూమిక పోషించాలి. దేశాభివృద్ధిలో ప్రైవేటు రంగం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇందువల్ల ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు.
  • తయారీ రంగాన్ని ప్రపంచ దేశాలకు పోటాపోటీగా తీర్చిదిద్దేందుకు విధాన నిర్దేతలు కృషి చేయాలి. వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సానుకూల విధానాలు రూపొందించి, కార్యాచరణకు నడుంబిగించాలి.
  • పారిశ్రామిక విధానాల్లో సోషలిస్ట్‌ విధానాలు బదులు, ప్రపంచానికి పోటీగా తయారీ రంగాన్ని ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై దృష్టి సారించాలి. పౌరులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలి.
  • సరఫరా వ్యవస్థలు బలంగా ఉంటేనే, తక్కువ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వగలం. అంతర్జాతీయ తయారీ సంస్థలు దేశంలోకి వచ్చేలా చూడాలి. తయారీ రంగంలో ఈ మార్పులు రావాలంటే సమయం పడుతుంది. అందువల్ల పటిష్ట సంస్థలను దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం ద్వారా, ఇక్కడ నుంచి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించాలి. ఇందుకు ప్రత్యేక పథకాలు అవసరం.

ABOUT THE AUTHOR

...view details