కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం వార్తలు, దేశ వృద్ధి రేటుపై సానుకూల అంచనాలు స్టాక్ మార్కెట్లను వరుసగా ఆరో రోజూ పరుగులు పెట్టించాయి. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 181 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,608 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,393 వద్దకు చేరింది.
వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీనికి తోడు టీసీఎస్ సహా ఇతర హెవీ వెయిట్, ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించడం మార్కెట్ల లాభాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 45,742 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,335 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,435 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు స్థాయి), 13,311 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.