తెలంగాణ

telangana

ETV Bharat / business

Financial Planning: అవసరానికి ఆదుకునేలా.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా..! - financial planning for future

Financial Planning: కరోనా మహమ్మారి మన ఆర్థిక జీవన శైలిని మార్చేసింది. మన భవిష్యత్‌ లక్ష్యాలు.. ఆలోచనలనూ చిక్కుల్లోకి నెట్టేసింది. మరోసారి ప్రపంచం ఈ మహమ్మారి ముప్పును ఎదుర్కొంటోంది. ఈ మూడో దశను తట్టుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధం అవుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. గతం నేర్పిన పాఠాలు మర్చిపోకుండా మనమూ ఆర్థికంగా తయారుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Financial Planning
Financial Planning

By

Published : Jan 7, 2022, 11:16 AM IST

Financial Planning: ఆరోగ్యంగా ఉండటం ఇప్పుడు అన్నింటికన్నా అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యాలతోపాటు.. ఆర్థికారోగ్యంపైనా దృష్టి పెట్టాల్సిన తరుణమిది. ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు ప్రతి విషయాన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచించాచాకే నిర్ణయం తీసుకోవాలి. డబ్బును తెలివిగా వాడుకోవడం ఎప్పుడూ సవాలే. ఎంత కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక వేసుకున్నా.. కొన్నిసార్లు వాటిని పక్కకు పెట్టక తప్పదు. ఇప్పటి అవసరాలను తీర్చాలి.. భవిష్యత్‌కు భరోసానివ్వాలి అనే తీరుగా మన వ్యూహాలు ఉండాలి. అందుకే కరోనా కష్టకాలంలో అవసరాలకు తగిన విధంగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి.

అవసరానికి ఆదుకునేలా..

అవసరాలు ఎప్పుడూ చెప్పిరావు. అందుకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడేలా కొంత నిధి ఉండాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. నిత్యావసరాలను దాచుకోవడం అనేది ఇప్పుడు కొత్తేమీ కాదు. కాకపోతే డబ్బు రూపంలో ఉండటమే కాస్త కష్టమైన పనిగా తోస్తుంది చాలామందికి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని అత్యవసర నిధికి మళ్లిస్తూనే ఉండాలి. ఎంత మొత్తం మన దగ్గరుంటే.. అంత నిశ్చింత అని మర్చిపోవద్దు. పేరుకు తగ్గట్టే నిజంగా అత్యవసరం అనుకున్నప్పుడే ఈ నిధిని వాడుకోండి.

వాయిదాలను వాయిదా..

ఆర్థికంగా కాస్త ఆచితూచి అడుగేయాల్సిన సమయమిదే. అందుకే, కొత్త అప్పుల జోలికి వీలైనంత వరకూ వెళ్లకండి. డబ్బులు చేతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటే.. రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను నిలిపి వేసేందుకు అవకాశం ఉందా అనేది ఒకసారి చూసుకోండి. దీనికోసం మీ బ్యాంకును సంప్రదించండి. ఇప్పటివరకూ సరిగ్గా చెల్లిస్తూ ఉంటే.. బ్యాంకులు దీనికి అవకాశం ఇవ్వవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లులనూ కనీస చెల్లింపుతో సర్దుబాటు చేయొచ్చు. ఇవన్నీ అదనపు వడ్డీ భారంతోనే అని మర్చిపోవద్దు. క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం ఉంటుంది. అయితే, తప్పదు అనుకున్నప్పుడే ఈ వ్యూహాన్ని వాడాలి.

సర్దుబాటు చేయాలి..

మహమ్మారి నేర్పిన పాఠాల్లో ‘మన చేతి నిండా డబ్బు ఉండాలి’ అనేది ముఖ్యమైనది. అత్యవసరం వచ్చిన ప్రతిసారీ ఇతరులమీదే ఆధారపడాల్సి వస్తుంటే.. దానికి మించిన ఆర్థిక అనారోగ్యం మరోటి ఉండదు. పైగా మీ వ్యక్తిగత సంబంధాలనూ ఇది దెబ్బతీస్తుంది. మీ చేతిలో డబ్బు లేదు అనుకుంటే.. ముందుగా దీర్ఘకాలిక లక్ష్యాలకు కేటాయిస్తున్న మొత్తాన్ని కొన్నాళ్లపాటు నిలిపివేయాలి. ఆ మొత్తాన్ని స్వల్పకాలిక అవసరాల కోసం సర్దుబాటు చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది తాత్కాలిక సౌలభ్యం కోసమే.

కాస్త జాగ్రత్తగా..

అధిక నష్టభయం ఉన్న చోట మంచి రాబడికి అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఇలాంటి పెట్టుబడి పథకాల్లో మదుపు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారా అనేది చూసుకోండి. షేర్లు, క్రిప్టో కరెన్సీలాంటి వాటిలో మదుపు చేస్తే... స్వల్పకాలంలో ధరల హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని క్షుణ్నంగా విశ్లేషించుకున్న తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోండి. మిగులు మొత్తం ఉండి, మంచి షేర్లు అందుబాటు ధరలో ఉన్నాయని భావించినప్పుడే మదుపు చేయండి.

వివరాలు తెలియజేయండి..

తీసుకున్న బీమా పాలసీలు, చేసిన పెట్టుబడులు చాలామంది రహస్యంగా ఉంచుతుంటారు. మహమ్మారి వేళలో ఈ అలవాటు మార్చుకోవాలి. మీ ఆర్థిక వివరాలన్నీ ఒకచోట రాసి పెట్టండి. వాటిని కుటుంబ సభ్యులకు తెలియజేయండి. కుటుంబ బాధ్యతలకు తగ్గట్టుగా పెట్టుబడులు కొనసాగుతున్నాయా లేదా అనేదీ దీనివల్ల తెలుసుకోవచ్చు.

ఇదీ చూడండి:Digital Payments: ఇంటర్నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు

ABOUT THE AUTHOR

...view details