Crisil Report On LIC: జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ), ఈక్విటీపై 82శాతం ప్రతిఫలాన్ని (ఆర్‌ఓఈ) అందిస్తోందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరానికి ముందు ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 100 శాతం ఉండగా, 2016కు క్రమంగా తగ్గి 71.8 శాతానికి వచ్చిందని, 2020కి 64.1 శాతానికి దిగిందని నివేదిక తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎస్‌బీఐ లైఫ్ మార్కెట్ వాటా 2016లో 5 శాతం ఉండగా, 2020కి 8 శాతానికి పెరిగిందని 2021 నవంబరులో తయారు చేసిన నివేదికలో క్రిసిల్ వెల్లడించింది. తొలి, రెండో స్థానంలో ఉన్న బీమా సంస్థల మార్కెట్ వాటా పరంగా ఇంత తేడా మరే దేశంలోనూ లేదు. ఈ నివేదిక ప్రకారం..
- 5,640.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.23 లక్షల కోట్లు) స్థూల రిటెన్ ప్రీమియంతో (జీడబ్ల్యూపీ) ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
- 2021 మార్చి నాటికి ఈ సంస్థకు 13.5 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. దేశంలో ఉన్న మొత్తం ఏజెంట్ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ వాటానే 55 శాతం కావడం గమనార్హం.
- చైనా మార్కెట్‌లో పింగ్ యాన్ ఇన్సూరెన్స్, చైనా లైఫ్ ఇన్సూరెన్స్‌లు 21 శాతం (7,413 కోట్ల డాలర్లు), 20 శాతంతో (6,965 కోట్ల డాలర్లు) ప్రీమియం వసూళ్లలో ఆధిపత్యం కనబరుస్తున్నాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్ లైఫ్ మార్కెట్ వాటా 16.2 శాతంగా (3,984 కోట్ల డాలర్లు) ఉంది.
- అత్యధిక ఆర్‌ఓఈ అందిస్తున్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఐసీ 82 శాతంతో అగ్ర స్థానంలో ఉంది. పింగ్ యాన్ ఇన్సూరెన్స్ ఆఫ్ చైనా 19.5 శాతం, అవివా 14.8 శాతం, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 11.9 శాతం మాత్రమే అందిస్తున్నాయి.
- మొత్తం ఆస్తుల పరంగా చూస్తే ఎల్‌ఐసీ 52,200 కోట్ల డాలర్లతో (సుమారు రూ.39.15 లక్షల కోట్లు) అతి పెద్ద ఆరో సంస్థగా ఉంది. పింగ్ యాన్ (1,38,000 కోట్ల డాలర్లు), మెట్‌లైఫ్ (79,515 కోట్ల డాలర్లు), నిప్పాన్ లైఫ్ (70,500 కోట్ల డాలర్లు), అవివా లైఫ్ ఆఫ్ ఇంగ్లండ్ (65,734 కోట్ల డాలర్లు), చైనా లైఫ్‌లు (61,630 కోట్ల డాలర్లు) తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.
ఎల్‌ఐసీ బోర్డులోకి ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు