ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై- సెప్టెంబరు) ఐటీ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే మధ్యశ్రేణి కంపెనీలు బలమైన గణాంకాలు నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు పొందడంతో పాటు, డిజిటల్ సాంకేతికతలకు అవకాశాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో వివిధ దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో సరఫరాపరమైన అవరోధాలు తొలగడం కూడా సమీక్షా త్రైమాసికంలో ఐటీ కంపెనీలకు కలిసి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.
యాజమాన్యాల నుంచి సానుకూల సంకేతాలు
యాక్సెంచర్ యాజమాన్యం ఇటీవల చేసిన వ్యాఖ్యలు, హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం, ఎబిటా మార్జిన్ల అంచనాలను పెంచడం రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేస్తాయనడానికి సంకేతాలుగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వ్యయాల నియంత్రణ, ప్రయాణ ఖర్చులు తగ్గడం, కరెన్సీ మారకపు ప్రయోజనాలు లాంటివి కంపెనీల నిర్వహణ మార్జిన్లు మెరుగవడానికి తోడ్పడతాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇటీవల ఐటీ రంగ షేర్ల కదలికలను గమనిస్తే కూడా.. రెండో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయో ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్‌కు మించి ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఐటీ సూచీ రాణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 9 శాతమే పెరగ్గా, ఐటీ సూచీ 34.2 శాతం వరకు దూసుకెళ్లిందని చెబుతున్నారు.