జెట్ ఎయిర్వేస్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సమస్యలకు తోడు సంస్థ ఉద్యోగులు జీతాలు చెల్లించాలని నేడు ధర్నా చేశారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే వరకు ఆరు నుంచి ఏడు విమానాలు మాత్రమే నడిపించాలని జెట్ ఎయిర్వేస్ నిర్ణయించుకుంది.
జీతాలు చెల్లించాలని 'జెట్' ఉద్యోగుల ధర్నా - airways
ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన జెట్ఎయిర్వేస్కు మరో సమస్య ఎదురైంది. జీతాలు చెల్లించాలని దిల్లీ విమానాశ్రయంలోని 3వ నెంబర్ టెర్మినల్ వద్ద సంస్థ ఉద్యోగులు ధర్నా చేశారు.
రోజువారీ కార్యకలాపాలకు మధ్యంతర నిధులు మంజూరు చేయాలని ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కూటమిని జెట్ కోరనుంది. రాబోయే నిధుల నుంచి తమ జీతాల్ని చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దిల్లీ విమానాశ్రయం టెర్మినల్- 3 వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. "జెట్ ఎయిర్వేస్ను రక్షించండి... మా భవిష్యత్‌ను కాపాడండి", "మా ఏడుపు వినండి... 9డబ్ల్యూను నడపండి" అన్న నినాదాల బ్యానర్లతో ధర్నాలో పాల్గొన్నారు.
ప్రతీ ఎయిర్వేస్కు ఒక కోడ్ ఉంటుంది. ఇండిగో విమానాలకి '6ఈ' అనే కోడ్ ఉంది. అలానే జెట్ ఎయిర్వేస్ కోడ్ '9డబ్ల్యూ'. శుక్రవారం ముంబయిలోనూ జెట్ ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు.