ITRs For FY21: మార్చితో ముగిసే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన డిసెంబరు 31 గడువులోగా... దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్) ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ శనివారం వెల్లడించింది. ఇందులో 46.11 లక్షల ఐటీఆర్‌లు చివరిరోజైన డిసెంబరు 31న దాఖలయ్యాయని చెప్పింది.
మొత్తం 5.89కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్1లో 2.92కోట్ల రిటర్నులు, ఐటీఆర్2(54.8లక్షలు), ఐటీఆర్3(71.05 లక్షలు), ఐటీఆర్4(1.60కోట్లు), ఐటీఆర్5(7.66 లక్షలు), ఐటీఆర్6(2.58 లక్షలు), ఐటీఆర్7(0.67లక్షలు) దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది.
"మొత్తం ఐటీఆర్‌లలో 45.7శాతానికిపైగా... పోర్టల్‌లోని ఐటీఆర్ ఫామ్ ద్వారా దాఖలయ్యాయి. మిగతావి ఆఫ్‌లైన్‌లో దాఖలయ్యాయి. పన్నుచెల్లింపుదారులు ఐటీఆర్‌లు దాఖలు చేయడంలో ఇబ్బందులు కాకుండా ఉండేందుకు మేం నిరంతరం ప్రయత్నించాం" అని సీబీడీటీ పేర్కొంది. సకాలంలో ఐటీఆర్‌లు దాఖలు చేసినందుకుగాను పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కృతజ్ఞతలు తెలిపింది.