తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 1:43 PM IST

ETV Bharat / business

'భారతీయ ఫార్మాకు మరో పదేళ్లు చైనానే దిక్కు!'

చైనాపై ఆధారపడి ఉన్న కీలకమైన రంగాల్లో ఫార్మా ఒకటి. ఆ దేశం నుంచి ముడిసరకులు రానిదే ఇక్కడ పని జరగదు. ఈ రంగాలకు చైనా కాకుండా మరో ప్రత్యామ్నాయం లేదు. మరి ఈ విషయంలో స్వావంలంబన సాధించాలంటే ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

It will take 8-10 years to stop India's dependency on Imports from China for Active Pharmaceutical Ingredients
'ఫార్మాలో స్వయం సమృద్ధికి మరో పదేళ్లు'

భారత్- చైనా సరిహద్దు ఘర్షణలు దేశంలోని ప్రజానికాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. చైనాలో తయారైన ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇదే సమయంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వం సహా దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ 59 యాప్​లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

ఎల్​ఏసీలో హింసాత్మక ఘటన జరిగిన తర్వాత ఇరుదేశాల వాణిజ్యం సంబంధాల్లో భారీ మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. చైనాతో వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని భారత్​పై ఒత్తిడి పెరిగిపోతోంది.

అయితే వాణిజ్యపరంగా భారత్​కు చైనా ఎంతో కీలకం. చాలా రంగాలకు చైనా నుంచి వచ్చే ఉత్పత్తులే కీలకంగా ఉన్నాయి. మరి వీటన్నింటినీ దాటుకొని భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఎంత కాలం పడుతుందనేదే ఇప్పుడు ప్రశ్న.

ఫార్మా పరిస్థితేంటి?

చైనాపై ఆధారపడ్డ రంగాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఔషధ రంగం గురించే. చైనా ఉత్పత్తులను నిలిపివేస్తే తీవ్రంగా దెబ్బతినేది ఫార్మానే. అయితే ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత్​ కొత్త విధానాలను రూపొందించింది. కానీ, పూర్తి స్వావలంబన సాధించాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్​గ్రీడియెంట్స్(ఏపీఐ) కోసం కావాల్సిన ముడిసరకులలో 70 శాతం వస్తువులను చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. యాంటీబాడీల విషయానికి వస్తే 92-99 శాతం వరకు చైనాపైనే ఆధారపడుతోంది. సరకు రవాణాకు తీవ్ర విఘాతం కలగడం వల్ల తక్షణమే ఏపీఐ అవసరం ఉన్న కంపెనీలపై ప్రభావం పడనుంది. ఫలితంగా ఎగుమతులతో పాటు దేశీయ మార్కెట్​పై ప్రభావం చూపుతోంది. భారత ఫార్మా రంగానికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ ఎక్కువ డబ్బు ఖర్చు చేసినా అదే రకమైన వస్తువులు వేరే చోటు నుంచి తీసుకురాలేము. ఐరోపా నుంచి అధిక ధరలు పెట్టి కొన్ని ముడిసరకులు కొనుగోలు చేయవచ్చు. కానీ భారతదేశ అవసరాలను అవి తీర్చలేవు."

-అశోక్ కుమార్ మదన్, భారత ఔషధ తయారీదారుల సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఏపీఐతో పాటు మరికొన్ని కీలకమైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు అశోక్. భారత్​తో పాటు ఫార్మా ఉత్పత్తులను తయారు చేసే ప్రతి దేశం చైనాపైనే ఆధారపడి ఉందన్నారు. అమెరికా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు.

"ప్రస్తుతం ఫార్మా పరిశ్రమల్లో రెండు మూడు నెలలకు సరిపోయే నిల్వలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయల గురించి ఆలోచించాలి. స్వయం సమృద్ధి సాధించే దిశగా వెళ్లడమనేది ప్రస్తుతం కష్టతరమైన ప్రతిపాదన. ఇదే లక్ష్యంగా పనిచేసినట్లయితే.. స్వావలంబన సాధించడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది."

-అశోక్ కుమార్ మదన్, భారత ఔషధ తయారీదారుల సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

రసాయన వస్తువుల విషయంలో ప్రపంచ ఫార్మా రంగంలో మూడింట రెండొంతుల వాటా చైనాదేనని ఫార్మెక్స్​సిల్ డైరెక్టర్ రవి ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 65-70 శాతం ఏపీఐ డ్రగ్స్ ముడిపదార్థాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయని తెలిపారు.

"చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఫార్మా రంగంలో కొన్ని పథకాలు తీసుకొచ్చింది. క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో క్లస్టర్​కు రూ. 1000 కోట్లు కేటాయించింది. అయితే దీనికి కొంత సమయం పడుతుంది."

-రవి ఉదయ్ భాస్కర్, ఫార్మెక్స్​సిల్ డైరెక్టర్

అమెరికా తర్వాత భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు, దిగుమతులలో చైనా వాటా వరుసగా 9, 18 శాతంగా ఉంది. రసాయన, ఆటోమొబైల్ విడిభాగాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లోని పరిశ్రమలకు ఈ దిగుమతులు చాలా అవసరం.

పెరుగుతున్న దిగుమతులు

ఫార్మాకు అవసరమైన ఏపీఐ దిగుమతులు గత ఏడేళ్లుగా పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2012 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి ఏపీఐ దిగుమతులు 62 శాతంగా ఉంటే.. 2019 నాటికి 68 శాతానికి చేరింది. ఈ పరిస్థితుల్లో చైనాపై నిషేధం విధిస్తే భారత పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ధరలపై ప్రతికూల ప్రభావం పడి.. పరిశ్రమల ఖర్చులు పెరుగుతాయి. చివరకు వినియోగదారులపైనా భారం పడుతుంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details