'వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథం' - జీఎస్‌టీ మండలి భేటీ
20:27 May 28
'వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథం'
దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ.. విదేశాల నుంచి భారత్‌కు విరాళంగా వస్తున్న కొవిడ్ వైద్య పరికరాలు, ఔషధాలకు ఐ-జీఎస్‌టీ నుంచి ఆగస్టు 31 మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ తెలిపారు. ఈ మేరకు జీఎస్‌టీ మండలి 43వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. చికిత్స కోసం వినియోగించే ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కూడా మినహాయింపు జాబితాలో పెట్టినట్లు నిర్మల చెప్పారు.
కొత్త పన్ను రేట్ల విధానంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం జూన్ 8లోపు నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ నివేదికను అనుసరించి.. అవసరం మేరకు మరికొన్ని వస్తువులపై మినహాయింపులు లేదా జీఎస్‌టీ తగ్గించడంపై నిర్ణయం ఉంటుందని వివరించారు. అయితే ప్రస్తుతం టీకాలపై విధించిన 5 శాతం పన్ను రేటుపై మాత్రం మండలి ఏ నిర్ణయం తీసుకోలేదు. అది కొనసాగనుంది.
రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం లక్షా 58 వేల కోట్ల రూపాయల మేర అప్పు చేయనున్నట్లు నిర్మల వెల్లడించారు. రాష్ట్రాలకు 2022 తర్వాత చెల్లించే జీఎస్‌టీ పరిహారం విషయంలో చర్చించేందుకు జీఎస్‌టీ మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతుందని నిర్మల వివరించారు.