తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా సొమ్ము భద్రంగా పొందాలంటే ఇలా చేయండి! - వాహన బీమా

బీమా చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు.. క్లెయిమ్ చేయడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. కొన్ని సమయాల్లో క్లెయిమ్​ తిరస్కరణకు కూడా గురవుతుంది. ఇదంతా తలనొప్పి వ్యవహారం. మరి దీనికి పరిష్కారం.. బీమా సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం. అవేంటో తెలుసుకుందామా?

బీమా సొమ్ము భద్రంగా పొందాలంటే.. ఇలా చేయండి!

By

Published : Sep 29, 2019, 4:58 PM IST

Updated : Oct 2, 2019, 11:42 AM IST

మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల ఆపద సమయల్లో అక్కరకొస్తుందని బీమా చేయిస్తుంటాం. అనారోగ్య సమయంలో ఆసుపత్రి బిల్లుకు ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా, వాహనాల కోసం వాహన బీమా చేయిస్తాం. 'అనుకోకుండా మనకు ఏదైనా జరిగితే' అనే భయంతో కుటుంబానికి ఆర్థిక రక్షణగా జీవిత బీమా చేయించుకుంటాం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ బీమాలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తప్పవు.

సాధారణంగా చేసే తప్పులు ఇవే

1. బీమాకు దరఖాస్తు చేసే సమయంలో తప్పు సమాచారాన్ని పొందుపరచడం

చాలా మంది చేసే అతి సాధారణ తప్పు ఇదే. దరఖాస్తు సమయంలో మీరు ఇచ్చిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకుంటాయి బీమా సంస్థలు. వీటిలో ఎటువంటి సవరణలకు అవకాశమివ్వవు. అందువల్ల క్లెయిమ్​ సమయంలో మీరు పూర్తి చేసిన దరఖాస్తుకు, బీమా చేసినప్పుడు మీరిచ్చిన వివరాలకు సరిపోలకపోతే క్లెయిమ్​ తిరస్కరణకు గురవుతుంది.

పరిష్కారం!

బీమా నమోదు సమయంలో వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని నింపాలి. ఫారంలో ఏ విభాగాన్నీ ఖాళీగా వదిలేయకూడదు. ఒక వేళ మీకు సంబంధించిన అంశం కానట్లయితే అక్కడ క్రాస్​ గుర్తు పెట్టాలి. ఫారం సమర్పించే ముందు దాని నకలు ఒకటి తీసుకుని మీ దగ్గర ఉంచుకోవాలి.

2. బీమా నెలవారీ వాయిదా సొమ్ము సమయానికి చెల్లించండి

మీరు నెలవారీ వాయిదాను గడువులోపు చెల్లిస్తే క్లెయిమ్​ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. కొన్ని సంస్థలు గడవు లోపల వాయిదా చెల్లించకపోతే పాలసీ రద్దుతో పాటు, క్లెయిమ్​కు అవకాశం లేకుండా చేస్తాయి.

మరి ఎలా?

ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే మీ మొబైల్​లో ఒక రిమైండర్​ను ఏర్పాటు చేసుకోవాలి. వాయిదా గడువు దగ్గర పడగానే అది గుర్తు చేస్తుంది. ఉద్యోగుల ఖాతాలోకి జీతం రాగానే నేరుగా చెల్లింపులు జరిగేలా కొన్ని సంస్థలు సౌలభ్యం కలిగిస్తాయి. వాటిని ఉపయోగించుకోవడం మంచిది.

3. అనారోగ్య చరిత్రను దాచిపెట్టడం

బీమా చేసేటప్పుడు అనారోగ్య చరిత్రను దాచిపెట్టకూడదు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు జారీ చేసే ముందు బీమా సంస్థలు సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్రను పరిశీలిస్తాయి. ఆ సమయంలో అనారోగ్య విషయాలను దాచి పెడితే క్లెయిమ్​ సమయంలో అటంకాలు కలుగుతాయి.

ఇలా చేయండి

పాలసీ తీసుకునే ముందు మీరు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. సంస్థలకు నిజమైన రిపోర్టులు సమర్పించండి. ఒక వేళ మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే మొదటి దశలోనే ఫారం తిరస్కరణకు గురవుతుంది. సొమ్ము ఆదా అవుతుంది.

4. పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోవడం

బీమా చేసే సమయంలో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు మీ జీతం వివరాలు, మీకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వాటినీ ఫారంలో తెలపాలి. అలాగే ఇంతకు ముందు ఏదైనా బీమా ఉండి ఉంటే అ వివరాలు కూడా తెలియజేయాలి. మీ ఎత్తు, బరువు, వయసు, చిరునామా వంటి ప్రాథమిక అంశాలూ జాగ్రత్తగా నింపాలి.

5. గడువు దాటిన తరవాత క్లెయిమ్ చెయ్యడం

కొంత మంది గడువు దాటిన తరవాత బీమా క్లెయిమ్​ చేస్తారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. ఘటన సంభవించిన వెంటనే క్లెయిమ్​ చెయ్యకపోతే ఇందులో ఏదో మతలబు ఉందని బీమా సంస్థలు అనుమానిస్తాయి.

త్వరపడాలి

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే 48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచార అందజేయాలి. దీనివల్ల బీమా సొమ్ము తొందరగా అందుతుంది.

* పైన చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తే సులభంగా... బీమా సొమ్ము నేరుగా మీ ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది.

ఇదీ చూడండి:ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

Last Updated : Oct 2, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details