భారత్‌లోకి ప్రవేశించడంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. భారత్‌లో కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ మేరకు గత నెల ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
పూర్తిగా అనుసంధానించిన కార్లను దిగుమతి చేసుకోవడం కంటే.. పరికరాలను యూనిట్ల వారీగా దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపినట్లు అధికారి పేర్కొన్నారు. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని టెస్లాను కోరినట్లు తెలిపారు. అలాగే దిగుమతి సుంకాలను తగ్గిస్తే భారత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి కార్యాచరణను సమర్పించాలని అడిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా కోరినట్లు వెల్లడించారు.
భారత్‌లో ఇప్పటి వరకు 100 మిలియన్ డాలర్లు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసినట్లు టెస్లా ప్రతినిధులు తెలిపారు. పన్నులు తగ్గిస్తే ఈ విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే విక్రయాలు, సేవలు, ఛార్జింగ్ వసతుల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ఇలా భారత్‌లోకి దశలవారీగా ప్రవేశించి పూర్తి స్థాయి తయారీలో పెట్టుబడులు ప్రారంభిస్తామని స్పష్టం చేసినట్లు అధికారి వెల్లడించారు.