అంతర్జాతీయంగా 'వినోద- ప్రసార మాధ్యమ' (మీడియా) విపణిలో భారత్ హవా కొనసాగుతోంది. 2021 నాటికి భారత్ 10 అగ్రశ్రేణి విపణిల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది.
అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు:
* మీడియా- వినోద రంగంపై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 32 డాలర్లు (రూ.2,080)కు చేరే అవకాశం ఉంది.
*ప్రపంచంలోనే ఓటీటీ ( కోరుకున్న వీడియోల వీక్షణ ) విపణిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రధానంగా స్మార్ట్ఫోన్ల వినియోగం దేశంలో బాగా పెరగడం, డేటా ఛార్జీలు తగ్గడం ఓటీటీ కంటెంట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. 2017లో 30.36 బిలియన్లుగా ఉన్న ఈ మార్కెట్ విలువ 2022 నాటికి 52.68 బిలియన్లకు చేరుకుంటుందని అసోచామ్ అంచనా.
*అంతర్జాతీయంగా ఓటీటీ మార్కెట్ 2017-22 మధ్య కాలంలో 10.1 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) సాధించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్ ఈ విభాగంలో ప్రస్తుతం 297 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2022 నాటికి 823 మిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అంటే సుమారు 22.6 శాతం వార్షిక వృద్ధి సాధిస్తుందని అసోచామ్ అంచనా వేసింది. వీడియో ఆన్ డిమాండ్ (వీఓడీ) విభాగంలో జరుగుతున్న వృద్ధి దీనికి ప్రధాన కారణం.