ప్రపంచ దేశాలకు మొబైల్ ఫోన్లను, విడిభాగాలను ఎగుమతి చేసేందుకు భారతదేశం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని భారత సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ సంఘం(ఐసీఈఏ) వెల్లడించింది. 'ప్రారంభం, పునరుద్ధరణ, పునరుత్తేజం' అనే వ్యూహాలతో 2025 నాటికి ఇక్కడి నుంచి 10వేల కోట్ల డాలర్ల (100 బిలియన్ డాలర్లు) విలువైన మొబైల్ ఫోన్లనూ, దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన విడిభాగాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా విధించుకున్నట్లు పేర్కొంది. ఈవై ఇండియాతో కలిసి కొవిడ్-19 తర్వాత మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, అవకాశాలు అనే అంశంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. చైనా, వియత్నాంలోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంస్థలు ప్రపంచ మార్కెట్‌లో 80శాతానికి పైగా వాటా ఉంది. దాదాపు 198 దేశాలు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం మూడోస్థానంలో...
ఇలాంటి తరుణంలో భారత్ ఎలా అడుగులు వేయాలన్న దానికి ఏం చేయాలనే అంశాలను ఇందులో చర్చించారు. మొబైల్ ఎగుమతుల్లో ప్రస్తుతం భారత్ 3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే రెండోస్థానంలోకి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐసీఈఏ పేర్కొంది. కొవిడ్-19 తర్వాత దేశీయ ఉత్పత్తి రంగానికి నాయకత్వం వహించడానికి మొబైల్, విడిభాగాల రంగం సిద్ధంగా ఉందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రూ తెలిపారు. గురువారం దృశ్యమాధ్యమం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు నాటికి 100 శాతం ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.