తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: 'ఇతర ఆదాయాల'కూ లెక్క చూపాలి - మ్యూచువల్​ ఫండ్లు

గత ఆర్థిక సంవత్సరం (2018-19)కి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఆఖరి తేదీ ఆగస్టు 31. ఆదాయపు పన్ను గణించడానికి... వేతనం ద్వారా వచ్చే ఆదాయాలతో పాటు ఇతర ఆదాయాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. మరి వాటిని ఎలా గణించాలో తెలుసుకుందామా?

సిరి: 'ఇతర ఆదాయాల'కూ లెక్క చూపాలి

By

Published : Aug 2, 2019, 3:49 PM IST

2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఆఖరి తేదీ ఆగస్టు 31. పన్ను వర్తించే ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మీ పెట్టుబడులు, వచ్చిన మొత్తం ఆదాయాలు, పన్ను మినహాయింపు కోసం చేసిన పొదుపులు ఇలా అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు కేవలం వేతనం ద్వారా వచ్చిన ఆదాయాన్నే కాకుండా, అదనపు ఆదాయాలను ప్రత్యేకంగా చూపించాలి. అవేమిటి? వాటిని ఎలా గణించాలి తెలుసుకుందాం!

వేతనం ద్వారా వచ్చే ఆదాయం

వేతనం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేవారికి యాజమాన్యం... ఫారం 16ను ఇస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆదాయం ఎంత అనేది గణించేందుకు ఇది సరిపోతుంది. అయితే ఫారం 16లో పొందుపర్చని ఆదాయాలను ఇన్​కంట్యాక్స్​ రిటర్ను (ఐటీఆర్​)లో పొందుపర్చాలి. లేనట్లయితే మొత్తం ఆదాయాన్ని గణించడంలో పొరపాటు చేసినట్లు అవుతుంది.

ఇతర ఆదాయాలు ఎలా లెక్కించాలి

ఆర్థిక సంవత్సరంలో మనకు తెలియకుండానే కొన్ని ఆదాయాలను ఆర్జిస్తుంటాం. ఇవన్నీ ఫారం 16లో నమోదుకావు. వీటన్నింటినీ ఆదాయపు పన్ను పరిగణనలోనికి తీసుకోవాల్సిందే. సాధారణంగా మనకు ఎలాంటి ఇతర ఆదాయాలు వస్తుంటాయి. వాటిపై పన్ను ప్రభావం ఎలా ఉంటుందో గమనిద్దాం!

క్యాష్​ బ్యాక్​

నగదు వెనక్కి... అదేనండి.. క్యాష్​ బ్యాక్ మనల్ని ఎక్కువగా ఆకర్షించే పదం. ఏదైనా కొనుగోలు చేసేప్పుడు క్యాష్​ బ్యాక్​ వస్తుందా అనేది ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటాం. ముఖ్యంగా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, పేమెంట్‌ యాప్స్‌, క్రెడిట్‌ కార్డుల నుంచి సాధారణంగా నగదు వెనక్కి వస్తుంటుంది. క్యాష్‌ బ్యాక్‌ వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది నగదు బదిలీ సేవల కోసం పేమెంట్స్‌ యాప్‌ సేవలను వినియోగించుకుంటారు.

ఉదాహరణకు...మీరు ఒక ఫుడ్‌ యాప్‌ నుంచి రూ.500 విలువైన ఆహారపదార్థాలను కొనుగోలు చేశారనుకుందాం. దీనికి రూ.50 క్యాష్ బ్యాక్​ వచ్చిందనుకుందాం. ఈ మొత్తం మీరు ఎలా చెల్లించారన్నదాన్ని అనుసరించి మీ బ్యాంకు ఖాతా, ఈ వ్యాలెట్‌, క్రెడిట్‌ కార్డు ఖాతాలకు వచ్చి జమ అవుతుంది. మరి, ఈ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించాలా? ఆదాయపు పన్ను రిటర్నులలోనూ చూపించాల్సి వస్తుందా?

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇలా వచ్చే మొత్తాన్ని బహుమతులుగా పరిగణిస్తారు. ఇలా 'నగదు వెనక్కి' (క్యాష్​బ్యాక్) రూపంలో వచ్చిన మొత్తం అంతా కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000లకు మించితే, అప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 56 (2) ప్రకారం ఆ ఆదాయాన్ని లెక్క చూపాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 'ఇన్‌కం ఫ్రం అదర్‌ సోర్సెస్‌'’ కింద పేర్కొనాలి. అంటే.. క్యాష్​ బ్యాక్​, రివార్డులు, బహుమతులు అన్నీ కలిపి రూ.50,000లకు లోపు ఉన్నప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.

రివార్డు రూ.5వేలు దాటితే

మీ యాజమాన్యం మీకు ఏదైనా బహుమతిని వోచర్‌ కింద ఇచ్చినప్పుడు.. ఆ మొత్తం రూ.5,000లకు మించినప్పుడు దీన్ని ఆదాయపు పన్ను గణనలోనికి తీసుకుంటారు. ట్యాక్స్‌ రూల్‌ 3(7) ప్రకారం దీన్ని ఆదాయంగా చూపించాలి. అదే విధంగా స్నేహితులు, బంధువుల దగ్గరి నుంచి రూ.50,000లకు మించి గిఫ్ట్‌ వోచర్స్‌ను స్వీకరించినా 'ఇన్‌కం ఫ్రం అదర్‌ సోర్సెస్‌'’ కింద చూపించాలి.

జీవిత భాగస్వామి, తోబుట్టువులు, పిల్లలకు ఇచ్చిన బహుమతులకు... వారి చేతుల్లో మినహాయింపు వర్తిస్తుంది. అయితే, ఆ బహుమతుల ద్వారా ఏదైనా ఆదాయం వచ్చినప్పుడు మొత్తం ఆదాయంలో కలిపి చూపించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులకు వర్తించే పన్ను శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాలి. స్నేహితులు, బంధువుల నుంచి బహుమతులు పొందడం ఆనందమే. అదే సమయంలో వాటిపై వర్తించే పన్ను విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి.

ఈ-వ్యాలెట్లతో

మొబైల్‌ ఫోను ద్వారా నగదు బదిలీ చేసేందుకు చాలామంది ఈ-వ్యాలెట్లు, యూపీఐలను ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు స్నేహితులకు తిరిగి చెల్లించాల్సిన అప్పులూ వీటిద్వారానే తీర్చేస్తుంటారు

ఉదాహరణకు... మీరు ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ మొత్తం బిల్లును మీరు చెల్లించారు. ఆ తర్వాత మీ మిత్రులందరూ... మీకు ఆ డబ్బును పంపించారనుకుందాం. అప్పుడు ఆ డబ్బును ఆదాయపు పన్ను లెక్కల్లో ఎలా చూపించాలి? ఇలా స్నేహితులు పంపించింది బహుమతిగానే పరిగణిస్తారు. అయితే, వీటి విలువ రూ.50,000 మించనంత వరకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆ మొత్తం దాటినప్పుడే చిక్కులు వస్తాయి. నిబంధనల ప్రకారం వాటికి లెక్క చూపాల్సిందే.
అయితే, మీకు రావాల్సిన బాకీలకు సంబంధించిన డబ్బు. ఈ - వ్యాలెట్లు, పొదుపు ఖాతాలోకి వచ్చి జమైతే.. ఆ మొత్తాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ ఈ మొత్తాలపై ఏదైనా వివరణ కోరే అవకాశం ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఆధారాలు చూపించేందుకు మీ దగ్గర్నుంచి అప్పు తీసుకొని, తిరిగి చెల్లించిన వారి నుంచి రశీదుల్లాంటివి తీసుకోండి.

పొదుపు ఖాతా నుంచి..

బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న మొత్తానికి వచ్చే వడ్డీపై రూ.10,000 వరకూ సెక్షన్‌ 80 టీటీఏ ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది. ఈ పరిమితికి దాటి వడ్డీ ఆదాయం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తిగత ఆదాయం కింద పరిగణలోనికి తీసుకొని, వర్తించే ఆదాయపు పన్ను శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి సీనియర్‌ సిటిజన్లకు రూ.50,000 వరకూ పన్ను వర్తించదు.

మ్యూచువల్‌ ఫండ్ల లాభాలపై..

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశారా? వాటి యూనిట్లను విక్రయించడం ద్వారా మీకు లాభం వచ్చినప్పుడు దాన్ని కూడా రిటర్నులలో చూపించాల్సి వస్తుంది. మీరు ఫండ్లలో పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించారన్నది ఆధారంగా చేసుకొని, ఈ పన్ను లెక్క ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడిని ఏడాదికి మించి కొనసాగిస్తే.. దానిని దీర్ఘకాలిక పెట్టుబడిగా లెక్కిస్తారు. ఇలాంటప్పుడు యూనిట్లను విక్రయిస్తే వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం అంటారు.

పెట్టుబడి ఏడాదికన్నా తక్కువగా ఉంటే, దాన్ని స్వల్పకాలిక పెట్టుబడిగానూ, దానిపై వచ్చిన లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగానూ పరిగణిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభం రూ.1,00,000కు మించినప్పుడు... ఆ మొత్తంపై 10శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలిక మూలధన రాబడిపై 15శాతం పన్ను రేటు వర్తిస్తుంది.

డెట్​ మ్యూచువల్​ ఫండ్లు

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే, దీర్ఘకాలిక పెట్టుబడిగా లెక్కిస్తారు. మూడేళ్లలోపు పెట్టుబడిని స్వల్పకాలిక పెట్టుబడిగా లెక్కిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన తర్వాత వచ్చిన మొత్తంపై 20శాతం పన్ను చెల్లించాలి. స్వల్పకాలిక లాభాన్ని మొత్తం ఆదాయంలో భాగంగా చూపించి, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇది మర్చిపోవద్దు

వేతనంతోపాటు ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు వాటిని కచ్చితంగా ఆదాయపు పన్ను రిటర్నులలో చూపించడం మంచిది. వీటిని కలపడం వల్ల కొన్నిసార్లు మీరు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎలాంటి తప్పులు లేకుండా రిటర్నులు దాఖలు చేయాలనుకున్నప్పుడు ఈ అదనపు ఆదాయాలనూ వెల్లడించడం మర్చిపోకండి. మీకు ఏ అనుమానం ఉన్నా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇదీ చూడండి: గూగుల్ డూడుల్​ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు

ABOUT THE AUTHOR

...view details