తెలంగాణ

telangana

ETV Bharat / business

విజయాల 'కాఫీ కింగ్'.. విషాదాంతపు మజిలీ - business news

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కెఫే​ కాఫీ డే సృష్టికర్త ఆయన. కాఫీ సాగు కుటుంబంలో సంపన్నుడిగానే జన్మించి కాఫీ కింగ్​గా ఎదిగిన వ్యక్తి. ఒకప్పుడు విజయానికి చిరునామా. ఆయనే వి.జి.సిద్ధార్థ్​. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన నేడు ఓ విఫల వ్యాపారినంటూ ఉద్యోగులకు లేఖ రాసారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించి ఈ లోకాన్ని వీడారు.

విజయాల 'కాఫీ కింగ్'.. విషాదాంతపు మజిలీ

By

Published : Jul 31, 2019, 7:14 PM IST

Updated : Jul 31, 2019, 9:04 PM IST

భారత్​లో కాఫీ కింగ్​గా ప్రసిద్ధుడైన కెఫే కాఫీ డే వి.జి. సిద్ధార్థ కర్ణాటక చిక్​మగుళురులో జన్మించారు. ముంబయిలో మహేష్​ కంపానీ వద్ద స్టాక్​మార్కెట్ మెలకువలు నేర్చుకున్నారు. స్టాక్​బ్రోకింగ్, కెఫే కాఫీ డే, ఆతిథ్య రంగాల్లో తనదైన విజయాలు సాధించారు. పన్ను ఎగవేత కేసులో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆయన ఆకస్మిక మృతితో వ్యాపార రంగంలో ఓ శకం ముగిసింది.

మాతృమూర్తి ఒడిలో సిద్ధార్థ్​
బాల్యంలో సిద్ధార్థ్​
బాల్యంలో కాఫీకింగ్​ సిద్ధార్థ్​

సైనికులంటే గౌరవం

సిద్ధార్థకు సైనికులంటే ఎనలేని గౌరవం. అందుకే గ్రాడ్యుయేషన్​ పూర్తయ్యాక దేశం కోసం సైన్యంలో చేరాలనే తలంపుతో డిఫెన్స్ అకాడమీ పరీక్షలు రాశారు. కానీ ఉత్తీర్ణుడు కాలేకపోయారు. తరువాత మంగళూరులో ఆర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్​ చేశారు.

అడ్వాణీ నుంచి జ్ఞాపిక తీసుకుంటున్న కాఫీ కింగ్

మహేష్​ కంపానీ శిష్యరికం

విజయవంతమైన సారథిగా సిద్ధార్థ్​

గ్రాడ్యుయేషన్​ పూర్తయ్యాక స్టాక్​మార్కెట్​ శిక్షణ కోసం తల్లిదండ్రులను ఒప్పించి ముంబయి వెళ్లారు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజ్​ ప్రెసిడెంట్, జేఎం క్యాపిటల్ అధినేత మహేష్​ కంపానీ వద్ద శిష్యరికం చేశారు. స్టాక్​మార్కెట్ పాఠాలు, ట్రేడింగ్ మెలకువలు నేర్చుకున్నారు.

సొంత కంపెనీ ప్రారంభం

కుంటుంబ అనుబంధం

ముంబయి నుంచి తిరిగి బెంగళూరు చేరుకున్న సిద్ధార్థ.... ఏడున్నర లక్షలతో శివన్​ సెక్యూరిటీస్ అనే స్టాక్​ బ్రోకింగ్ కంపెనీని ప్రారంభించారు. ఈ ప్రయత్నం విజయవంతమైంది. వచ్చిన లాభాలతో చిక్​మగళూరులో కాఫీ తోటలు కొనేవారు సిద్ధార్థ. కొన్నాళ్లకు శివన్​ సెక్యూరిటీస్ వే2 వెల్త్​గా మారింది.

మామ ఎస్​.ఎమ్. కృష్ణ కుటుంబంతో సిద్ధార్థ్​

రిటైల్​ మార్కెట్​లోకి..

సిద్ధార్థ కుటుంబానికి 12 వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. అందుకే రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనుకున్నారు సిద్ధార్థ. ఆలోచన వచ్చిందే తడవుగా 1992లో అమాల్గమేటెడ్ బీన్​ కాఫీ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. విదేశాలకు కాఫీ ఎగుమతి చేస్తుండేవారు. కేవలం రెండేళ్లలోనే దేశంలోని అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా కంపెనీని నిలబెట్టారు సిద్ధార్థ.

కెఫే​ కాఫీ డే.. సంచలనం

కాఫీ కింగ్​- సిద్ధార్థ్​

1996లో బెంగళూరులో బ్రిగేడ్​ రోడ్​లో కెఫే​ కాఫీ డే పేరుతో తొలి రిటైల్ అవుట్​లెట్ ప్రారంభించారు సిద్ధార్థ. అప్పట్లో ఒక కాఫీ, గంట ఇంటెర్నెట్​కు రూ.100 వసూలు చేసేవారు. ఇది విశేష ఆదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించి దేశంలో అతిపెద్ద కాఫీ చైన్​గా అభివృద్ధి చేశారు. దీంతో కాఫీకింగ్​గా సిద్ధార్థ పేరు మార్మోగిపోయింది.

విదేశాల్లోనూ...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17వందల కెఫేలు, 48 వేల వెండింగ్ మిషన్లు ఈ సంస్థకు ఉన్నాయి. వియన్నా, చెక్​రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్టు లాంటి దేశాల్లోనూ కాఫీడే శాఖలున్నాయి.

ఆతిథ్య రంగంలోకి..

ఆతిథ్య రంగంలోనూ అడుగుపెట్టారు సిద్ధార్థ. ప్రముఖ ఐటీ సంస్థ మైండ్​ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్​ట్రీలో వాటాలను రూ.3 వేల కోట్లకు అమ్మేశారు.

వివాహ అనుబంధం

భార్య, బిడ్డలతో సిద్ధార్థ్​

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​.ఎం.కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మాళివిక సిద్ధార్థ కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు.

2008 నుంచి సిద్ధార్థ చెందిన హాస్పిటాలిటీ బిజినెస్​ను పూర్తిగా ఆమే చూసుకుంటున్నారు. కాఫీ డే బోర్డులోనూ ఆమె సభ్యురాలు.

కుటుంబసభ్యులతో సిద్ధార్థ్​

ఐటీ దాడులు

కెరీర్ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్ధార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. 2017లో ఆయన కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ముంబయి, బెంగళూరు, చిక్​మగళూరులోని కాఫీ డే దుకాణాలు, ఎస్టేట్​లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ.650 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.

మరోవైపు కెఫే​ కాఫీ డే కూడా గత కొంతకాలంగా నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ వాటాలను కోకాకోలాకు విక్రయించాలని సిద్ధార్థ అనుకున్నారు. ఇందుకోసం చర్చలు కూడా జరిగాయి.

విషాదాంతం..

నేత్రావతి నదిలో సిద్ధార్థ్ కోసం గాలింపు

వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం నిర్మించి సక్సెస్‌కు చిరునామాగా మారిన.. ‘కెఫే కాఫీడే’ యజమాని వి.జి సిద్ధార్థ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. నేత్రావతి నదిలో దూకినట్లు స్థానిక జాలరి ఒకరు వెల్లడించారు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది. కాఫీతో అద్భుతాలు సృష్టించిన వ్యాపార మాంత్రికుడి జీవితం విషాదాంతమవ్వడం దిగ్భ్రాంతికరం.

ఇదీ చూడండి:కాఫీడే సిద్ధార్థ మృతి- నది ఒడ్డున మృతదేహం

Last Updated : Jul 31, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details