ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) స్వాగతించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించే సానుకూల చర్యగా ఐఎంఎఫ్ ఆసియా-పసిఫిక్ విభాగం డైరెక్టర్ చాంగ్‌యోగ్ రీ అభివర్ణించారు. అయినా నిరంతర ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ లాంటి చర్యలు వృద్ధికి ఊతం కల్పిస్తాయని పేర్కొన్నారు చాంగ్‌యోగ్. బ్యాంకింగేతర సంస్థల్లో నెలకొన్న సమస్యల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. భారత్ లాంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహకరించేందుకు ఆయా దేశాల్లో ఐఎంఎఫ్ ప్రాంతీయ సంస్థల్ని నెలకొల్పిందని పేర్కొన్నారు.