పట్టుమని రెండు రోజుల్లోనే మరో లక్ష పైచిలుకు కేసుల విస్తృతితో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు, ఒక చెంప ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీదకు నెడుతూ, మరోవంక ప్రపంచార్థికాన్ని కుదేలుచేస్తూ కరోనా వైరస్ కోరసాచిన తీరుకు అగ్రదేశాలూ బావురుమనే దుస్థితి సంప్రాప్తించిందిప్పుడు! కరోనా విషకోరల్లో చిక్కి చైనా విలవిల్లాడుతున్నప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం విస్తరించే అవకాశంపై ఆందోళనలు చెవినపడుతున్నాయి. ఇప్పుడిక అలాంటి ఊహాపోహలకు తావేలేదని, ప్రపంచార్థికం మాంద్యంలోకి ప్రవేశించిందనీ ఐఎమ్‌ఎఫ్ తాజాగా స్పష్టీకరించింది. ఈ దశ 2009నాటి ఆర్థిక సంక్షోభం అంత తీవ్రంగానో, అంతకంటే అధ్వానంగానో ఉండబోతోందంటూ, కరోనా కట్టడిలో అంతర్జాతీయ సమాజం సఫలమై ఆర్థిక నష్టాల్ని పరిమితం చెయ్యగలిగినప్పుడే వచ్చే ఏడాదికైనా ప్రపంచం కోలుకోగలుగుతుందనీ హెచ్చరిస్తోంది. 1930లనాటి మహామాంద్యం తరవాత అంతటి ఆర్థిక సంక్షోభం పడగెత్తింది 2007-’09 నడిమికాలంలోనే! దానివల్ల ఒక్క అమెరికాకు వాటిల్లిన ఆర్థిక నష్టమే 22 లక్షలకోట్ల డాలర్లన్నది అక్కడి సర్కారీ అధ్యయనం నిగ్గుతేల్చిన లెక్కే! ప్రపంచ వస్తూత్పత్తుల కర్మాగారంగా వాసికెక్కిన చైనా కరోనా తాకిడి నేపథ్యంలో ఉత్పత్తి కార్యకలాపాల్ని దాదాపుగా స్తంభింపజేయడం, ఊహాతీత వేగంతో విస్తరించిన వైరస్ దేశదేశాల్లో ప్రకటిత, అప్రకటిత దిగ్బంధాలకు కారణం కావడంతో అభివృద్ధి అంచనాలన్నీ తలకిందులైపోయాయి. చైనా 4.5 శాతం, ఇండియా రెండున్నర శాతం వృద్ధిరేట్లకు పరిమితమవుతాయంటున్న అధ్యయనాలు- అన్ని దేశాల ప్రగతి సూచీలూ నేలచూపులు చూస్తున్నాయని నిర్ధారించాయి. తల్లడిల్లుతున్న ప్రపంచార్థికాన్ని తెప్పరిల్ల చేసేందుకంటూ జి-20 దేశాలు నిర్వహించిన అసాధారణ భేటీ- కరోనా వల్ల దాపురిస్తున్న సామాజిక ఆర్థిక నష్టాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించింది. అయిదు లక్షల కోట్ల డాలర్ల నిధుల ప్రవాహంతో ప్రపంచార్థికానికి కొత్త సత్తువ కల్పిస్తామని జి-20 వాగ్దానం చేస్తున్నా- కార్యాచరణ ప్రణాళిక ఇంకా రూపకల్పన దశలోనే ఉంది!
చిన్నా పెద్దా తేడా లేకుండా...!
ఆర్థికంగా శక్తిసంపన్నమైన 20 దేశాలు ప్రపంచార్థికంలో 79శాతం వాటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంటే తక్కిన 173 దేశాల వాటా కేవలం 21శాతమే. ఈ తరహా చిన్నాపెద్దా లెక్కలకు కాలంచెల్లేలా దాదాపు అన్ని దేశాల్నీ చుట్టుముట్టిన కరోనా ధాటికి- 'ఎంత చెట్టుకు అంత గాలి' చందంగా పెద్ద దేశాలు దారుణంగా దెబ్బతినిపోతున్నాయి. 2008నాటి సంక్షోభం ప్రపంచవ్యాప్తం కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టింది. కేవలం మూడు నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టిన కరోనా వైరస్- బడా బహుళజాతి సంస్థల నుంచి స్వయంఉపాధి పొందేవారి దాకా అందరి పొట్టా కొట్టి కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగానికి ఆవాహన పలికింది. 33కోట్ల అమెరికా జనాభాలో సగంమందికిపైగా ఇళ్లకే పరిమితమైపోగా, ప్రయాణ పర్యాటక పరిశ్రమలవంటివి పూర్తిగా పడకేయడంతో 30 లక్షలమంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. కాబట్టే రెండు లక్షల కోట్ల డాలర్ల భూరి సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్ సర్కారు- బోయింగ్ లాంటి కార్పొరేట్ల నుంచి చిరుద్యోగుల దాకా భిన్న వర్గాల్ని ఆదుకొనే కార్యాచరణ అమలుకు ఉపక్రమించింది. పరిశ్రమల మూత కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న ఐక్యరాజ్య సమితి- కార్మికులు మూడున్నర లక్షలకోట్ల డాలర్ల మేర ఆదాయం కోల్పోయే ప్రమాదంపైనా ముందస్తు హెచ్చరికలు చేసింది. ఇండియాలోనే పర్యాటకరంగంలో అయిదులక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారంపై కరోనా దుష్ప్రభావం ప్రసరించిందని పార్లమెంటరీ స్థాయీసంఘానికి పదిరోజుల నాడు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖే నివేదించింది. పరిస్థితి తీవ్రత ఇంత స్పష్టంగా కళ్లకు కనబడుతున్నందున- క్షీణిస్తున్న పారిశ్రామిక ఆరోగ్యాన్ని కుదుటపరచేందుకు, మాంద్యాన్ని చెదరగొట్టేందుకు సరైన ఔషధ సాంత్వన సత్వరం అందుబాటులోకి రావాలి!