తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా వేళ సత్తా చాటిన 'పీసీల' మార్కెట్‌ - laptop sales rises in covidlockdown

కరోనా సమయంలో వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో దాదాపు 13 శాతం పెరుగుదల నమోదైంది. 79.2 మిలియన్ల పీసీల అమ్మకాలు జరగ్గా... ఇందులో 64 మిలియన్లు ల్యాప్​టాప్​లే అమ్ముడయ్యాయి.

pc market in lockdown
కరోనా వేళ సత్తా చాటిన 'పీసీల' మార్కెట్‌

By

Published : Oct 12, 2020, 8:02 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైపోయాయి. వ్యాపారాలు జరగక పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. పాఠశాలలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. పెద్ద సంస్థలు కొన్ని ఇప్పటికీ తమ సిబ్బందికి 'వర్క్‌ ఫ్రం హోం' అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలాగే పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ క్లాస్‌లను అందిస్తూ పిల్లలకు పాఠాలను బోధిస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో పీసీల అమ్మకాలు జరిగాయి.

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 79.2 మిలియన్ల వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు జరిగినట్లు కెనాలిస్‌ అనే కంపెనీ తన నివేదికలో పేర్కొంది. అమ్మకాల్లో దాదాపు 13 శాతం పెరుగుదల సాధించినట్లు తెలిపింది. కొవిడ్‌19 సంక్షోభం వల్లే పీసీలకు డిమాండ్‌ వచ్చినట్లు విశ్లేషించింది. వీటిల్లో 64 మిలియన్లతో ల్యాప్‌టాప్‌లు అగ్రభాగం సాధించగా.. మిగతావి పీసీలు, నోట్‌బుక్‌, ట్యాబ్స్‌ వంటివి ఉన్నాయి. ఎక్కువ మంది 'వర్క్‌ ఫ్రం హోం' చేస్తుండటం వల్ల వ్యక్తిగతంగా కంప్యూటర్లనుగానీ ల్యాప్‌లనుగాని కలిగి ఉండాలని భావించడంతో కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు నివేదిక వెల్లడించింది.

లెనోవో, హెచ్​పీ హవా

గతేడాదితో పోలిస్తే లెనోవో అత్యధికంగా 11.4 శాతం పెరుగుదలతో 19 మిలియన్ల పీసీల యూనిట్లను వినియోగదారులకు విక్రయించింది. హెచ్‌పీ రెండో స్థానం, డెల్‌ మూడో స్థానంలో నిలిచాయి. అయితే గతేడాదితో పోలిస్తే పెరుగుదలలో హెచ్‌పీ 23.6 శాతం సాధించగా.. డెల్‌ మాత్రం 0.50 శాతం కోల్పోవడం గమనార్హం. నాలుగు, ఐదు స్థానాల్లో యాపిల్‌, ఏసర్‌ సంస్థలు నిలిచాయి. గడిచిన పదేళ్లలో పీసీల అమ్మకాలు ఈ స్థాయిలో జరగడం ఇదే ప్రథమం.

ABOUT THE AUTHOR

...view details