తెలంగాణ

telangana

ETV Bharat / business

IT jobs: కొత్త నైపుణ్యాలు.. కొత్త ఉద్యోగాలు - covid impact on it sector

ఐటీ రంగంలో వలసలు 23 శాతానికి పెరిగాయి. డిజిటల్​కు పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా నిపుణులైన ఉద్యోగులను చేర్చుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో అధిక వేతనం కోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వలసల బాట పడుతున్నారు.

Highly skilled employees are looking to other companies for 40-50 percent higher pay opportunities
IT Jobs: కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు

By

Published : Jun 19, 2021, 6:30 AM IST

Updated : Jun 19, 2021, 7:26 AM IST

కరోనా రెండో దశ ఉద్ధృతి ఐటీ రంగంపై తాత్కాలిక ప్రభావాన్నే చూపింది. చాలామంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొవిడ్‌-19 బారిన పడడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో 2-3 వారాలపాటు ఉత్పాదకత కొంత మేరకు తగ్గినా, మళ్లీ పరిస్థితులు కుదుటపడ్డాయి. ఐటీ సంస్థలు కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం.. డిజిటల్‌కు పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా 40-50 శాతం అధిక వేతనం లభించే అవకాశాల కోసం అధిక నైపుణ్యాలున్న ఉద్యోగులు ఇతర సంస్థల వైపు చూస్తున్నారు. అందువల్లే మళ్లీ ఉద్యోగ వలసల శాతం పెరిగింది.

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కరోనా మొదటి దశ ఆరంభం కాగానే, 'ఇంటి నుంచి పని'కి ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు అవకాశం ఇచ్చినందు వల్ల ఈ రంగం వృద్ధి ఆగలేదు. 2020-21లో హైదరాబాద్‌ ఐటీ రంగం 12.98 శాతం వృద్ధితో రూ.1.45లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించింది.

డిజిటల్‌ టెక్నాలజీలతో

కొవిడ్‌ పరిణామాల వల్ల అన్ని రంగాల్లో డిజిటల్‌ వాడకం ఎన్నో రెట్లు పెరిగింది. దీంతో ఐటీ నిపుణులు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ), ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, ఏఆర్‌-వీఆర్‌, బ్లాక్‌ చెయిన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 5జీ లాంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. ఈ డిజిటల్‌ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఉద్యోగుల సంఖ్య మార్చిలో 8-9 శాతం కాగా, ప్రస్తుతం 23-24 శాతానికి చేరింది. ఇంటి నుంచి పని చేస్తూనే, సరికొత్త నైపుణ్యాలను ఉద్యోగులు అభ్యసించారని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సంస్థలు కూడా తమ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణలో సహకరిస్తున్నాయి.

ప్రత్యేక నైపుణ్యాలకు గిరాకీ వల్లే

కొవిడ్‌ తొలి రోజుల్లో ఐటీ ఉద్యోగులు సంస్థలు మారేందుకు ఇష్టపడలేదు. కానీ, అంచనాలకు మించి ప్రాజెక్టులు రావడం వల్ల ఐటీ సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించాయి. 2020-21లో హైదరాబాద్‌ ఐటీ రంగం దాదాపు 47,000 కొత్త ఉద్యోగాలను సృష్టించిందని అంచనా. దీంతో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు చేరింది. ప్రాంగణ నియామకాలతో పాటు, అనుభవజ్ఞులను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గతంలో 20-30 శాతం వేతనం అధికంగా ఇస్తే ఉద్యోగులు కంపెనీ మారేవారు. ఇప్పుడు 40-50 శాతం అధికంగా ఇచ్చే కంపెనీలవైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలలో పట్టు సాధించి, అనుభవం కూడా ఉంటే, 100శాతం వేతనం అధికంగా ఇచ్చేందుకూ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఆగస్టులో 18-19 శాతంగా ఉన్న వలసలు, ఇప్పుడు 23శాతానికి మించాయి.

కొత్త అవకాశాలు వస్తున్నాయి

కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు నైపుణ్యం ఉన్న మానవ వనరుల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మనవాళ్లు ముందుండటం కలిసొచ్చే అంశం. భారత్‌ ముఖ్యంగా హైదరాబాద్‌ ఐటీ రంగానికి ఇది ఎంతో సానుకూల పరిణామం.

- భరణి కుమార్‌ అరోల్‌, అధ్యక్షుడు,

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా)

ఇవీ చూడండి:

Job alert: ఐటీ రంగంలో ఈ ఏడాది భారీగా కొలువులు!

30,00,000 బీపీఓ ఉద్యోగాల గల్లంతు!

Last Updated : Jun 19, 2021, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details