వర్క్ ఫ్రం హోం.. కరోనా ముందు వరకు ఇది కొంత మందికి మాత్రమే దొరికే అరుదైన అవకాశం. కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అన్ని రంగాల్లో వీలైనంత మందికి వర్క్ ఫ్రం హోం తప్పనిసరైంది. ఏడాదిన్నరకుపైగా కోట్లాది మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ ఇంత కాలం ఇంటి నుంచి పని చేయడం చూసిందే లేదు. అయితే అందరూ అనుకునేట్లు వర్క్ ఫ్రం హోంతో పూర్తిగా హ్యాపీలా లేరని తెలుస్తోంది. ఇంట్లోనే ఉండటం వల్ల ఎంత సేపు పని చేస్తున్నాం? ఏం తింటున్నాం? అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు కొంత మంది. ఇదే విషయమై..ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయంకకు ఆయన ఉద్యోగి భార్య ఓ లేఖ రాశారు. ఆ లేఖను గోయంక.. ట్విట్టర్లో షేర్ చేశారు.. కొంత నవ్వుకునే విధంగా ఉన్నా.. వర్క్ ఫ్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అందులో స్పష్టంగా ఉంది.
ఆ లేఖలో ఏముంది?
'సర్.. నేను మీ సంస్థలో పని చేసే ఉద్యోగి మనోజ్ భార్యను. ప్లీజ్ మీరు ఆయన్ను వెంటనే ఆఫీస్ నుంచి పని చేసేందుకు అనుమతివ్వండి. ఆయన రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇంకా కొన్నాళ్లు వర్క్ ఫ్రం హోం కొనసాగితే మా వైవాహిక బంధానికి ముగింపు పలకాల్సి వస్తుందేమో. ఎందుకంటే.. పని చేస్తూ రోజుకు పది సార్లు కాఫీ తాగుతున్నారాయన. ఇంట్లోని గదులన్నీ తిరుగుతూ మళ్లీ మళ్లీ తింటున్నారు. ఆ గదులన్నింటినీ చెత్త కుప్పలా తయారు చేస్తున్నారు. ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ కనీసం పడుకోవడం లేదు.