ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. నిరాశాజనకంగా ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేయనుంది. దేశ ఆదాయస్థితి, ఆర్థిక వృద్ధిని పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. కీలకమైన జీఎస్టీ పన్ను నియంత్రణపై నిర్ణయం తీసుకోనుంది.
గోవాలో జరుగనున్న 37వ జీఎస్టీ కౌన్సిల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక ప్రతినిధులు పాల్గొంటారు.
బిస్కెట్లు నుంచి ఆటోమొబైల్స్ దాకా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థికవృద్ధి ఆరేళ్ల కనిష్ఠం 5 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థికమందగమనం నేపథ్యంలో పన్ను రేట్లను తగ్గించాలని వివిధ రంగాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడిలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బిస్కెట్లు నుంచి ఆటోమొబైల్స్ వరకు... ఎఫ్ఎమ్సీజీ నుంచి హోటళ్ల దాకా పన్ను రేట్లు తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. అప్పుడే.. వినియోగం, దేశీయ డిమాండ్‌ను పెంచవచ్చని వాదిస్తున్నారు.
ఫిట్మెంట్ కమిటీ తిరస్కరణ
కేంద్ర, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు చెందిన ఫిట్మెంట్ కమిటీ.. బిస్కట్లు నుంచి కార్ల వరకు పన్ను రేట్లు తగ్గించాలన్న డిమాండ్లను తిరస్కరించిందని సమాచారం. దీని ప్రకారం ఆతిథ్య రంగం మినహా మరే రంగానికీ సానుకూల ప్రకటనలు రాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రాల వ్యతిరేకత
ఏదేమైనా ఈ దశలో జీఎస్టీ రేటు తగ్గించడం వివేకమైన చర్య కాదని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఎందుకంటే జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు 'సెస్ ఫండ్' రూపంగా పరిహారం అందుతోంది. ఇప్పుడు జీఎస్టీ రేటు తగ్గిస్తే అది లక్ష్య వృద్ధిరేటుకు ప్రతికూలంగా మారుతుందని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.