ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ప్రభుత్వం (Airports Privatisation) వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న ఇతర ఎయిర్‌పోర్ట్‌లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ కేబినెట్ నోట్‌ను రూపొందించింది. తదుపరి కేబినెట్ భేటీలో.. ఎయిర్‌పోర్ట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణకు ఎన్ఓసీ ఇచ్చే అంశంపై చర్చించే అవకాశముంది.
ఇందులో భాగంగా ప్రైవేటు సంస్థలతో కలిసి నడిపిస్తున్న నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో వాటాలను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లు వీటిలో ప్రధానంగా ఉన్నాయి.
హైదరాబాద్(AAI stake in Hyderabad Airport), బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో 13 శాతం వాటా (ఒక్కో ఎయిర్‌పోర్టులో).. దిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లలో 26 శాతం చొప్పున వాటా ఏఏఐ వద్ద ఉన్నట్లు అంచనా.