నష్టాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లకు ఆసరా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 670 కోట్లు మంజూరు చేసింది. పెట్టుబడి సహాయం కింద ఈ నిధులు అందించింది.
మొత్తం 43 ఆర్ఆర్బీలలో మూడింట ఒక వంతు బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకులే అధికంగా నష్టపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. 9 శాతం రెగ్యులేటరీ క్యాపిటల్ కోసం నిధులు అవసరమని తెలిపారు.
ఆర్ఆర్బీల రీక్యాపిటలైజేషన్ పథకం కింద కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్యాంకులకు పెట్టుబడి సహకారం అందించనున్నాయి. 50:15:35 నిష్పత్తిలో ఈ నిధులు సమకూర్చనున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉండగా, 35 శాతం ప్రాయోజిత బ్యాంకులకు, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంది. ఈ మేరకు నిధులను స్పాన్సర్ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మూలధన, రిస్క్ వెయిటెడ్ యావరేజీ(సీఆర్ఏఆర్) మధ్య నిష్పత్తి ఆర్బీఐ నిర్దేశించిన 9 శాతానికి పెరుగుతుందని చెప్పారు.