BSNL merger with BBNL: భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్)ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో (బీఎస్‌ఎన్‌ఎల్) లో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ వెల్లడించారు. ఆలిండియా గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐజీఈటీఓఏ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "బీబీఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ బీఎస్‌ఎన్‌ఎల్ కిందకు వస్తాయి" అని పూర్వార్ తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్ ఉంది. బీబీఎన్‌ఎల్ విలీన ప్రతిపాదనతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మరో 5.67 లక్షల కిలోమీటర్ల ఓఎఫ్‌సీ అందుబాటులోకి వస్తుంది. దేశంలో 1.85 లక్షల గ్రామ పంచాయతీలు యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) కింద ఈ కేబుల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యాయి, 2012 ఫిబ్రవరిలో బీబీఎన్‌ఎల్ 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు యూఎస్‌ఓఎఫ్ సాయంతో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (ఎస్‌పీవీ) ప్రారంభించింది. టెలికాం ఆపరేటర్లు తమ సేవల విక్రయాల ద్వారా పొందే ఆదాయంలో 8 శాతాన్ని లైసెన్స్ రుసుము కింద బీబీఎన్‌ఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది.