తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 7:18 PM IST

ETV Bharat / business

ఎయిర్​ ఇండియాలో ఎన్​ఆర్​ఐలకు 100శాతం పెట్టుబడులు

కొంతకాలంగా నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. పెట్టుబడుల విషయంలో ఎన్​ఆర్​ఐలకు 100 శాతం అనుమతినిస్తూ ఆమోదముద్ర వేసింది. అంతే కాకుండా.. కంపెనీ చట్టం-2013 లోనూ పలు సవరణలకు పచ్చజెండా ఊపింది.

Govt permits NRIs to own up to 100% stake in Air India
ఇక ఎయిరిండియాలో ఎన్​ఆర్​ఐలూ పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టొచ్చు

నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిరిండియాను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. ఎయిర్​ ఇండియాలో ప్రవాస భారతీయులు వాటా కొనుగోలు చేసేందుకు ఉన్న పరిమితిని వందశాతానికి పెంచింది. ప్రస్తుతం 49శాతం ఉన్న పరిమితిని సవరిస్తూ.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు.

విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం

మారిన నిబంధనల ప్రకారం.. ఎన్​ఆర్​ఐలు వందశాతం పెట్టుబడులు పెట్టొచ్చని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ అన్నారు. దీనివల్ల ప్రైవేటు రంగం ద్వారా ఎయిర్ ఇండియా నడుస్తుందని ఆయన చెప్పారు. ఫలితంగా ప్రయాణికులకు చక్కని సేవలతో సహా.. పెట్టుబడులు కూడా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. అయిదేళ్ల కాలంలో పెట్టబడులు పెంచేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల విదేశీ పెట్టుబడుల(ఎఫ్​డీఐ)కు భారత్‌ అందరూ కోరుకునే ప్రాంతంగా మారిపోయిందన్న జావడేకర్​.. ఇదొక గొప్ప మైలురాయి అని అభిప్రాయపడ్డారు.

కంపెనీ చట్టంలోనూ సవరణలు

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్ధకు మరింత జవసత్వాలు అందించేందుకు మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల చట్టం-2013లో పలు సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ నేరాలను నేరపూరిత పరిధిలో తప్పించడం సహా 72 సవరణలకు ఆమోదముద్ర వేసింది.

రాజీ ద్వారా పరిష్కరించుకునే 66 ఆర్థిక నేరాలలో 23 నేరాలను వేరే జాబితాలో చేర్చింది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:కరోనా మోసాలకు ఫేస్​బుక్​ 'నిషేధం' మందు

ABOUT THE AUTHOR

...view details