దేశంలో క్రిప్టోకరెన్సీ చెలామణీపై కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. పాలన వ్యవస్థను మెరుగుపరిచే ఏ సాంకేతికతను అయినా అమలులోకి తేవడానికి సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందులో క్రిప్టోకరెన్సీ ఒక భాగమేనన్నారు. సాంకేతికను స్వాగతించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.
"కొత్త సాంకేతికతను మేము స్వాగతిస్తాం. బ్లాక్‌చైన్ టెక్నాలజీ అందులో ఓ భాగం. వర్చువల్ కరెన్సీగా క్రిప్టో కరెన్సీ ఉంది. కొత్త విషయాలను, ఆలోచనలపై అవగాహన పెంచుకుని వాటిని ప్రోత్సహించాలని నేను బలంగా నమ్ముతాను. డిజిటల్ కరెన్సీలపై ఇంటర్ మినిస్టిరియల్ కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాము. ఈ క్రమంలో చట్టాన్ని ప్రతిపాదించాల్సి వస్తే.. పార్లమెంటులో ప్రవేశపెడతాము."
-అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి