కరోనా వైరస్ (కొవిడ్ -19) విస్తరణను అదుపు చేయడానికి విధించిన లాక్‌డౌన్‌తో అమ్యూజ్‌మెంట్ పార్కుల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని భారత అమ్యూజ్‌మెంట్ పార్కులు, పరిశ్రమల సంఘం (ఐఏఏపీఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగాల కల్పనలో, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమ కార్యకలాపాలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొంది.
లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాతా ఈ పరిశ్రమపై కొంతకాలంపాటు ప్రభావం ఉండవచ్చని, అందువల్ల ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, పన్ను రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ రంగంలోని సంస్థలకు ఏడాది పాటు జీఎస్‌టీ మినహాయింపు సహా అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, ఇతర చట్టపరమైన చెల్లింపులను 6 నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. దిగుమతి చేసుకున్న విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు చేయాలని అడిగింది. చెల్లించాల్సిన రుణ వాయిదాలపై 12 నెలల మారటోరియం విధించాలని, ఆర్థిక సంస్థలు కొత్తగా ఇచ్చే రుణాలకు 2 శాతం వరకు వడ్డీ రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆదాయపు పన్ను రేటు తగ్గించడం సహా నీరు, విద్యుత్‌ను రాయితీ ధరకు అందించాలని కోరింది. ఆయా సంస్థల్లో ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న ఉద్యోగులకు, ఈఎస్‌ఐ కార్పొరేషన్ నుంచి లాక్‌డౌన్ కాలానికి వేతనాలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.