కొవిడ్-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 8 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.8 వడ్డన తప్పదా! - పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం
ఎక్సైజ్ సుంకం పెంచాలన్న కేంద్రం నిర్ణయంతో ఇంధన ధరలు మరింత పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.8 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల నిర్వహణకు అదనపు వనరులు అవసరమవుతున్న నేపథ్యంలో.. వీటిని సమకూర్చుకునేందుకు ఇంధన ధరలను పెంచక తప్పదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత నెలరోజులుగా ఇంధనాలపే ఎక్సైజ్ సుంకం పెంచని నేపథ్యంలో ఇదే తగిన సమయమని నిపుణులు అంటున్నారు. ఈ చర్య వల్ల సంవత్సరానికి రూ. 60,000 కోట్ల అదనపు ఆదాయం లభించగలదని అంచనా. కాగా, ఎక్సైజ్ సుంకం పెరుగుదలను గురించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తులు ఇప్పటికే మొదలైనట్టు తెలిసింది. ఈ పెంపు నిర్ణయం ఎప్పుటి నుంచి అమలులోకి వచ్చేది త్వరలోనే ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పెట్రో ఇంధనాలపై అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ప్రస్తుత ధరలో సుమారు 70 శాతం పన్నులే. కాగా.. ప్రతిపాదిత ఎక్సైజ్ సుంకం పెరుగుదలతో ఇది 75 నుంచి 80 శాతానికి కూడా చేరే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ భారం రిటైల్ అమ్మకాలపై పడితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.