కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం... వంటి పరిణామాలతో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. పలు దేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తలెత్తటంతో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్య లోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే బంగారానికి అనూహ్యమైన గిరాకీ లభిస్తుంది. కాబట్టి ధర పెరిగి మదుపరులు లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కాలంలో బంగారం ధర తీరుతెన్నులపై వివిధ ఆర్థిక సేవల సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు
ఆర్థిక పరిస్థితులు అననుకూలంగా మారినప్పుడు బంగారానికి ఆకర్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతోంది అదే. వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్య విధానాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో నగదు సరఫరా గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే ‘వాస్తవ రాబడి’ ప్రతికూల ధోరణిని కనబరుస్తోంది. అందుకే ఫండ్ మేనేజర్లు, తమ పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు పెంచుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. డాలర్లలో చూస్తే బంగారం ధర గత ఏడాది కాలంలో 14 శాతం పెరిగింది. రూపాయిల్లో చూస్తే... గత ఏడాది ‘అక్షయ తృతీయ’ నుంచి ఇప్పటి వరకూ 43 శాతం పెరిగింది. ‘కరోనా’ భయం, లాక్‌డౌన్ వల్ల ప్రస్తుత అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలుదార్లు అంతగా కనిపించటం లేదు. కానీ వర్తకులు, ప్రజల చేతుల్లో ఉన్న బంగారం విలువ బాగా పెరిగింది. గత ఏడాది ఈ సమయంలో 1 గ్రాము ధర రూ.3200/ 3300 ఉండగా, ఇప్పుడు దాని విలువ రూ.4600 స్థాయిలో కనిపిస్తోంది. కానీ ధర పెరుగుదల వల్ల ఆభరణాలకు కొనుగోలుదార్లు కరవయ్యారు. కొవిడ్-19 తో డిమాండ్ ఇంకా క్షీణించింది. సమీప భవిష్యత్తులో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1 గ్రాము ధర రూ.5000 కంటే మించిపోవచ్చు.
- శేఖర్ భండారి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు, కోటక్ మహీంద్రా బ్యాంకు
అధిక పెట్టుబడి డిమాండ్‌తో అధిక ధర
ప్రస్తుతం ‘లాక్‌డౌన్’ ఉన్నందున ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు వంటివాటిని ఈ అక్షయ తృతీయ వేళ కొనుగోలు చేయటం సాధ్యం కాని పరిస్థితి ఉంది. కానీ బంగారానికి ‘పెట్టుబడి డిమాండ్’ మాత్రం పెరుగుతోంది. సాంకేతికంగా చూస్తే ధరలో హెచ్చుతగ్గులు అధికంగా చోటుచేసుకునే అవకాశం ఉంది. కానీ దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.44,000 కంటే పైన ఉన్నంత వరకూ ఇదింకా పెరిగే అవకాశమే ఉంటుంది. సమీప భవిష్యత్తులో రూ.47,300/ 48,550 కూడా పలకవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ సంస్థ అయిన ఎస్‌పీడీఆర్ గోల్డ్ హోల్డింగ్స్ వద్ద బంగారం నిల్వలు పెరుగుతూ ఉండటం కూడా దీనికి డిమాండ్ అధికంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 22 నాటికి ఎస్‌పీడీఆర్ హోల్డింగ్స్ వద్ద 1,042.46 టన్నుల బంగారం ఉంది. కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే ఈ నిల్వలు 8 శాతం పెరిగాయి. గత ఏడాది కాలంలో చూస్తే 16.7 శాతం పెరిగిన విషయం స్పష్టమవుతుంది. అందువల్ల సమీప భవిష్యత్తులో బంగారానికి అధిక పెట్టుబడి డిమాండ్‌తో పాటు ధర పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
- రాహుల్ గుప్తా, హెడ్ (రీసెర్చ్), ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
10 గ్రాముల ధర రూ.52,000కు!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితితో కూడిన పరిస్థితుల వల్ల బంగారానికి గిరాకీ లభిస్తుందనేది నిర్వివాదాంశం. వాస్తవానికి గత రెండేళ్లుగా బంగారంపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించింది. 2019 లో బంగారం ధర 25 శాతం పెరిగింది. ఈ ఏడాదిలోనూ ఇంతవరకూ 10 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే బంగారమే సరైన సాధనం. ఎన్నో దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతున్నందున సరఫరా-గిరాకీ కుప్పకూలాయి. ఇటువంటి పరిస్థితుల్లో మదుపరులు బంగారం పెట్టుబడి సాధనాలైన ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ (కమాడిటీ ఫ్యూచర్స్), గోల్డ్ బాండ్స్‌పై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఎంతోమంది తమ ఇతర రకాలైన పెట్టుబడులను తగ్గించుకొని, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపవచ్చు. కాకపోతే గత ఏడాది కాలంలో బంగారం ధర బాగా పెరిగినందున ఏదో ఒక సందర్భంలో ఒక్కసారిగా ధర పతనం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కానీ మధ్యకాలానికి ఇది ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో 10 గ్రామలు బంగారం ధర రూ.52,000 పలికినా ఆశ్చర్యం లేదు.
- నవ్‌నీత్ దమానీ, ఉపాధ్యక్షుడు (కమాడిటీస్ రీసెర్చ్), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
ఇదీ చూడండి: మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్!