కరోనా కారణంగా ప్రతి రంగంలో మార్పులు జరుగుతున్నాయి. అన్ని డిజిటల్ వేదికగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని మహమ్మారి సృష్టించింది. కిరాణా వ్యాపారం నుంటి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు డిజిటల్‌కు మారిపోతున్నాయి. బీమా రంగంలో ఇప్పటికే డిజిటల్ ప్రక్రియ ఉన్నప్పటికీ కేవైసీ లాంటివి భౌతికంగా జరగాల్సి ఉండేవి. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా డిజిటల్‌కు మారిపోయింది.
బీమా తీసుకునే సమయంలో చేయాల్సిన కేవైసీ ప్రక్రియను వీడియో ఆధారంగా చేసుకోవచ్చని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) అనుమతిచ్చింది. కొంత కాలం క్రితం ఆర్బీఐ అనుమతించటంతో.. ఇప్పటికే బ్యాంకులు, ఆర్థిక పరమైన సంస్థలు వీడియో కేవైసీని ఉపయోగిస్తున్నాయి.
వీడియో కేవైసీకి సంబంధించి బీమా సంస్థలకు.. యాప్‌లు, కేవైసీ చేసే ప్రతినిధులు తదితర మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి.
"వీడియో కేవైసీ విధానం కింద వినియోగదారులు తమ ఇళ్ల నుంచే సులభంగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. లాక్డౌన్, సామాజిక దూరం పాటించాల్సిన ఈ సమయంలో వినియోగదారుల సౌలభ్యాన్ని, కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ విధానం బీమా సంస్థలకు సహాయపడుతుంది. ఈ విధానం ద్వారా ఆన్లైన్ లో ఆధార్‌ను ఉపయోగించి కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లైతే.. ఈ సదుపాయాన్ని సరైన సమయంలో ప్రవేశపెట్టారు. పాలసీ కొనుగోలుకు వినియోగదారుడు ఏజెంట్లను కలిసే అవసరం లేదు. మొత్తం డిజిటల్ గానే పాలసీ కొనుగోలు, కేవైసీ, పాలసీ పత్రాలను పొందటం వంటివి చేయవచ్చు.”
- నవల్ గోయల్,సీఈఓ, పాలసీ ఎక్స్
ఎలా పనిచేస్తుంది?
ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం వీడియో కేవైసీ చేస్తున్న కంపెనీ ప్రతినిధి వినియోగదారుడి వీడియో, ఫోటోలు తీసుకుంటారు. ఆధార్ కార్డు ద్వారా గుర్తింపునకు సంబంధించిన ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. పాలసీదారుడు భారతదేశంలో ఉంటున్నాడన్న విషయాన్ని నిర్ధరించుకునేందుకు.. జీపీఎస్ ద్వారా వినియోగదారుడి లొకేషన్ తీసుకుంటారు.