కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనం ఇందుకు ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని కరోనా దెబ్బతీయకుండా అడ్డుకుంటామని జీ7 దేశాలు ప్రకటించాయి.
కరోనాపై పోరు కోసం తమ వద్ద ఉన్న సరైన విధానపరమైన అస్త్రాలను ఉపయోగించడానికి సిద్ధమని జీ7 ప్రతినిధులు తెలిపారు.
"చర్యలు చేపట్టడానికి జీ7 దేశాల ఆర్థికమంత్రులు సిద్ధంగా ఉన్నారు. అవసరమైన చోట ఆర్థికంగా సహాయపడటం ఇందులో భాగం. ఈ దశలో వైరస్ను ఎదుర్కొని, ఆర్థిక వ్యవస్థకు మద్దతిస్తాం. జీ7 కేంద్ర బ్యాంకులు తమ ఆదేశాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాయి. ఫలితంగా ధరల్లో నిలకడ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పదు."
--- జీ7 ప్రకటన
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర బ్యాంకుల్లోని సభ్యులు, ఆర్థికమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జీ7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యులుగా ఉన్నాయి.