తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2022, 5:50 AM IST

ETV Bharat / business

Future Retail News: ఫ్యూచర్‌ రిటైల్​ ఆస్తులకు బహిరంగ బిడ్డింగ్‌!

Future Retail News: ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం ఫ్యూచర్‌ రిటైల్‌ మొత్తం ఆస్తులను బహిరంగ బిడ్ల ద్వారా విక్రయించాలని బ్యాంకుల కన్షార్షియం సుప్రీం కోర్టుకు అభ్యర్థించింది. ఆ డబ్బుతో బకాయిలను రికవరీ చేసుకోనున్నట్లు తెలిపింది. బిడ్లు వేసేందుకు రిలయన్స్‌, అమెజాన్‌లను అనుమతించాలని కోరింది.

Future Retail News
Future Retail News

Future Retail News: ఫ్యూచర్‌ రిటైల్‌కు (ఎఫ్‌ఆర్‌ఎల్‌) రుణాల రూపంలో ఇచ్చిన డబ్బు డిపాజిటర్లది కాబట్టి.. ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం ఎఫ్‌ఆర్‌ఎల్‌ మొత్తం ఆస్తులను బహిరంగ బిడ్ల ద్వారా విక్రయించాలని బ్యాంకుల కన్షార్షియం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బిడ్లు వేసేందుకు రిలయన్స్‌, అమెజాన్‌లను అనుమతించాలని కోరింది. సంస్థ కనీస ధరను రూ.17,000 కోట్లుగా పెట్టాలని.. తద్వారా తమ బకాయిలను రికవరీ చేసుకోగలమని అవి తెలిపాయి. బకాయిలు చెల్లించలేకపోయిన తమపై బ్యాంకులు ఎటువంటి కఠిన చర్యలూ తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్‌ఆర్‌ఎల్‌ చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. అయితే గురువారం కూడా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం ఇవ్వలేదు. చెల్లింపుల బకాయిలపై సెటిల్‌మెంట్‌కు రావడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఇందుకు 10-15 రోజుల సమయం ఇవ్వాలని, అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని ఎఫ్‌ఆర్‌ఎల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే కోరారు. ఇది ఎఫ్‌ఆర్‌ఎల్‌ విజ్ఞప్తే కాబట్టి విచారణను వాయిదా వేయవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఓపెన్‌ బిడ్‌ ఎందుకంటే..

"మేం రూ.17,000 కోట్ల రుణాలిచ్చాం. మరో ఏడాది గడిస్తే, ఆ మొత్తం రూ.25,000 కోట్లకు చేరుతుంది. ఆ సంస్థ అమెజాన్‌ లేదా రిలయన్స్‌లలో ఎవరి చేతికి వెళుతుందో తెలియదు. ఒక వేళ అమెజాన్‌ గెలిస్తే రూ.7000 కోట్లు వస్తాయి. కానీ మాకు రావాల్సినవి రూ.17,000 కోట్లు. ఒక వేళ రిలయన్స్‌ గెలిస్తే.. ఫ్యూచర్‌కు రూ.25,000 కోట్లు వస్తాయి. ఆ మొత్తం గ్రూప్‌నకే చెందుతాయి. ఈ రెండు సందర్భాల్లోనూ బ్యాంకులు దివాలా స్మృతిని అమలు చేయాల్సి వస్తుంది" అని ద్వివేది వివరించారు. అందుకే ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఆస్తులను అమెజాన్‌, రిలయన్స్‌లకు ఒపెన్‌ బిడ్‌ ద్వారా విక్రయించడం మేలని సూచించారు. రూ.17,000 కోట్లకు మించి బిడ్‌ వస్తే మాకివ్వాల్సింది ఇచ్చి.. మిగతాది ఫ్యూచర్‌ గ్రూప్‌ తీసుకోవచ్చని ద్వివేది పేర్కొన్నారు. ఇందుకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ సిద్ధమేనని సాల్వే చెప్పగా.. అమెజాన్‌ న్యాయవాది కూడా మాట్లాడేందుకు అభ్యంతరం లేదన్నారు.

ఇదీ చూడండి:తగ్గిన ఫేస్​బుక్ యూజర్ల సంఖ్య.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి..

ABOUT THE AUTHOR

...view details