కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితిలో మార్పులొచ్చాయి. సరైన ప్రణాళిక కలిగిఉంటేనే ఈ తరహా గడ్డు సమయాలను ఎదుర్కోగలం. దైనందిన జీవితంలోని ఖర్చులను తగ్గించుకుంటూ.. చక్కని భవిష్యత్ కోసం పాటించాల్సిన ఆర్థిక సూత్రాలను తెలుసుకుందాం..
అహం ఉంటే పతనమే..
జీవితంలో నాకేమిటి?అనే అహం ఎప్పుడూ చేటే. ఇది ఒక వదిలించుకోవాల్సిన చెడ్డ అలవాటే. డబ్బు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మనం షేర్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాని విలువ పతనం కావొచ్చు. ఆ.. ఏమవుతుందిలే అన్న అహంకారాన్ని వీడి ఆ షేర్లను ఒకసారి సమీక్షించుకోండి. అవసరమైతే వదిలించుకోండి. తక్కువ నష్టంతో బయటపడండి. లేదూ.. మీలోపలున్న అహం మిమ్మల్ని దాన్ని విక్రయించడానికి వీలు కల్పించకపోతే.. ఆ తర్వాత భారీగా పెరిగిన నష్టాలను చూసి చింతించకతప్పదు.
జ్ఞానం.. ఉపయోగించడం తెలియాలి..
ఒక విషయంపై ఎంతోకొంత జ్ఞానం అందరికీ ఉంటుంది. కానీ, దాన్ని సరైన వేళ ఉపయోగించడం ప్రధానం. అందుకే దేశీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ వెళ్లాలి. ఎప్పటికప్పుడు అమల్లోకి వచ్చే నిబంధనల గురించి తెలుసుకుంటూ ఉండాలి. షేర్లు, ఫండ్‌లు, స్థిరాస్తి తదితరాల్లో కొత్త నిబంధనలు, కొత్త పన్ను అంశాలు ఏవైనా మారాయా అనేది తెలుసుకుంటూనే ఉండాలి. అపుడే మీరు కష్టపడి దాచిన డబ్బు విలువ తగ్గకుండా ఉంటుంది.
తాహతుకు మించి వద్దు..
ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం చేటే చేస్తుంది. అటువంటి అలవాటు మీ వ్యక్తిగత ఆర్థిక జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎందుకంటే అలా చేసే ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు కాస్తా మిమ్మల్ని మీ లక్ష్యాలకు సుదూరంగా లాక్కెళతాయి.
ఒక్క తప్పుతో..
పొరపాటు మానవ సహజం. కానీ, కొన్నిసార్లు మనం చేసే తప్పు.. మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఈక్విటీ ఫండ్‌లలో పెట్టుబడులను కొనసాగించినప్పటికీ వేళకానివేళ యూనిట్లను విక్రయిస్తే.. అప్పటిదాకా పడ్డ కష్టం తుడిచిపెట్టుకుపోతుంది. ఈక్విటీ ఫండ్‌లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో స్పల్పకాల సంక్షోభాలకు వెరసి వాటిని బయటకు తీయకపోవడమూ అంతే ప్రధానం.
గుడ్డిగా నమ్మొద్దు..
మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారు అని అనుకోం. కానీ, కొన్నిసార్లు అనుమానించాల్సిందే. ఆర్థిక సలహాల కోసం మీకు తెలిసిన వారిపైనే పూర్తిగా ఆధారపడడం తప్పు. వారు చెప్పేది వింటూనే మీరు సొంతంగా పరిశోధన చేసుకోవడమో లేదంటే ఒక ఆర్థిక సలహాదారును సంప్రదించడమో అత్యుత్తమం. మీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు ఇది చాలా ముఖ్యం.