తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహన రంగానికి హ్యాండిచ్చిన పండుగ సీజన్​

కష్టాల్లో ఉన్న వాహన రంగాన్ని పండుగ సీజన్ కూడా గట్టెక్కించలేకపోయింది. ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ తమ అమ్మకాల్లో రెండంకెల క్షీణతను ప్రకటించాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, హ్యుందాయ్​, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, హోండా ఉన్నాయి.

వాహన రంగానికి హ్యాండిచ్చిన పండుగ సీజన్​

By

Published : Oct 2, 2019, 5:07 AM IST

Updated : Oct 2, 2019, 8:20 PM IST

పండుగ సీజన్​లోనూ వాహన రంగానికి నిరాశే ఎదురయ్యింది. ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ వాహనాల అమ్మకాలు క్షీణించాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్​ మహీంద్రా, టాటా మోటార్స్​, టయోటా, హోండా ఉన్నాయి.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా.. ఈ ఏడాది ప్రయాణికుల వాహన అమ్మకాలు 26.7 శాతం క్షీణించి.. 1,12,500 యూనిట్లకు పరిమితమైందని ప్రకటించింది. 2018 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 1,53,550 యూనిట్లుగా ఉందని తెలిపింది.

భారీ క్షీణత

2018 సెప్టెంబర్​లో ఆల్టో, వాగన్ఆర్​లో సహా మినీ కార్లు అన్నీ 34,971 యూనిట్లు అమ్ముడుపోయాయి. కాగా ఈ ఏడాది అమ్మకాలు 42.6 శాతానికి తగ్గి కేవలం 20,085 యూనిట్లకు పరిమితమయ్యాయి.

కాంపాక్ట్ సెగ్మెంట్​లో స్విఫ్ట్​, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్​ మోడళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 22.7 శాతం క్షీణించాయి. అంటే 2018లో 74,011 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడు ఆ సంఖ్య 57,179 యూనిట్లకే పరిమితమైంది.

సెడాన్​ సియాజ్​ అమ్మకాలు గతేడాది 6,246 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది కేవలం 1,715 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.

కొంత నయం

విటారా బ్రెజ్జా, ఎస్​-క్రాస్​, ఎర్టిగా సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు గతేడాదితో పోల్చితే స్వల్పంగానే తగ్గాయి. గతేడాది 21,639 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది 21,526 యూనిట్లు సేల్​ అయ్యాయి.

భారీ సంస్థలన్నీ ఒకే బాటలో

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ పీవీ అమ్మకాలు 14.8 శాతం తగ్గి 40,705 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఆ సంస్థ వాహన అమ్మకాలు 47,781 యూనిట్లుగా ఉన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా.. ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 33 శాతం క్షీణించాయని ప్రకటించింది. 2018లో 21,411 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది 14,333 యూనిట్లకే పరిమితమయ్యాయని స్పష్టం చేసింది. అయితే నవరాత్రి పండుగ సీజన్​లో తమ కంపెనీ వాహనాలు అమ్మకాలు పుంజుకుంటాయని నమ్ముతున్నట్లు ఎమ్ అండ్​ ఎమ్ సేల్స్​ అండ్​ మార్కెటింగ్ చీఫ్​ విజయ్ రామ్​ నక్రా పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ ఉద్దీపన చర్యలూ దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

టయోటా కిర్లోస్కర్​ మోటార్స్ అమ్మకాలు 18 శాతం మేర క్షీణించి కేవలం 12,512 యూనిట్లకే పరిమితమయ్యాయి. వినియోగదారుల సెంటిమెంట్ క్షీణించడమే వాహనరంగ మందగమనానికి కారణమని టీకేఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రాజా అభిప్రాయపడ్డారు. నవరాత్రి, దీపావళిల్లో అమ్మకాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్​ (హెచ్​సీఐఎల్​) దేశీయ అమ్మకాలు 37.24 శాతం క్షీణించాయని ప్రకటించింది. గతేడాది 14,820 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది 9,301 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని స్పష్టం చేసింది.

టాటా మోటార్స్ వాహనాల దేశీయ అమ్మకాలు 56 శాతం మేర తగ్గాయి. గతేడాది 18,429 యూనిట్లు సేల్​కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 8,097 యూనిట్లకు పరిమితమైంది. ఈ నెలాఖరుకు వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశముందని టాటా మోటార్స్ అధ్యక్షుడు మయాంక్ పరీక్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతానికి ఉపరాష్ట్రపతి అభినందనలు

Last Updated : Oct 2, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details