ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫావిపిరవిర్ (200 ఎంజీ) ఔషధాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. దీన్ని తీసుకున్న రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు ఔషధ కంపెనీలు పేర్కొంటున్నాయి. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. అయిదు కాదు, పది కాదు, బాధితులు దాదాపు 100 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తోంది. అదీ 10 రోజుల వ్యవధిలోనే.
తొలి రోజు 18 ట్యాబ్లెట్లు, ఆ తర్వాత దాదాపు 9 రోజుల పాటు రోజుకు 8 ట్యాబ్లెట్లు తీసుకోవాలి. కొందరు 14 రోజుల పాటూ వాడాల్సి వస్తోంది. కొన్ని కంపెనీలు ఇందులో 400 ఎంజీ ట్యాబ్లెట్ తయారు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఆ డోసు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ట్యాబ్లెట్‌కు బదులు సూదిమందు తయారు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలకు వచ్చింది. దీంతో పెద్దఎత్తున పరిశోధనలు చేపట్టాయి.
హైదరాబాద్ నుంచే..
ఒక అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇంజక్షన్ తయారీకి దాదాపుగా సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇప్పటికే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు విడుదల చేసింది. ఇంజక్షన్ తయారీ పరిజ్ఞానాన్ని తన ల్యాబ్‌లో పరీక్షించి చూస్తున్నట్లు, త్వరలోనే దీన్ని తయారు చేసి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం... ఇప్పటికే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ల తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఇంజక్షన్ రాబోయే అవకాశాలున్నాయి.
'ఫావిపిరవిర్' తయారీలో అగ్రగామి
ఈ యాంటీ-వైరల్ ఔషధాన్ని జపాన్‌కు చెందిన ఫ్యూజీఫిల్మ్ కార్పొరేషన్‌కు చెందిన టయోమా కెమికల్ కంపెనీ ఆవిష్కరించింది. ఎన్నో ఏళ్లుగా జపాన్‌తో పాటు పలు దేశాల్లో 'అవిగన్' అనే బ్రాండు పేరుతో విక్రయిస్తోంది. ప్రధానంగా ఇన్‌ఫ్లుయంజా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. కొవిడ్-19 కు సరైన మందులు లేని పరిస్థితుల్లో ఫావిపిరవిర్‌ను ప్రయోగాత్మకంగా కొద్ది మంది రోగులకు ఇచ్చినప్పుడు వారు త్వరగా కోలుకున్నారు. ఫలితంగా దీనికి ప్రాధాన్యం పెరిగింది.
రెండు నెలల క్రితం మనదేశంలో తొలిసారిగా గ్లెన్‌మార్క్ ఫార్మా ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక డజనుకు పైగా కంపెనీలు ఈ జనరిక్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఔషధాన్ని తయారు చేయటంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు అగ్రస్థానంలో ఉండటం. ఇప్పటికే 10కి పైగా స్థానిక ఫార్మా కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయి.
ఎగుమతులు కూడా...