తెలంగాణ

telangana

ETV Bharat / business

'టెస్లా స్టాక్​ అమ్మాలనుకుంటున్నా!- మీరేమంటారు?'

అమెరికాలో డెమొక్రాటిక్‌ పార్టీ ప్రతిపాదించిన 'బిలియనీర్స్‌ ట్యాక్స్‌' విధానం (Elon Musk tweet tesla stocks) నేపథ్యంలో పన్ను ఎలా కట్టాలన్నదానిపై ఓ ట్వీట్ చేశారు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌. అయితే.. పన్ను కోసం తన టెస్లా వాటాల్లో ఓ 10 శాతం అమ్మాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇది సరైన నిర్ణయమేనా? కాదా? అని తన అనుచరులను అడిగారు. మస్క్​ ట్వీట్ చేసిన రెండు గంటల్లో వచ్చిన సమాధానాల్లో 54 శాతం మంది ఆ నిర్ణయం సరైనదేనని సలహా ఇచ్చారు. మీరూ మస్క్​కు సలహా ఇవ్వొచ్చు.

Elon Musk net worth
బిలియనీర్స్‌ ట్యాక్స్‌ విధానం

By

Published : Nov 7, 2021, 12:15 PM IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు ఓ చిక్కొచ్చి పడింది. స్టాక్స్‌ రూపంలో జీతభత్యాలు తీసుకునే ఆయన.. ఇప్పుడు పన్ను ఎలా కట్టాలన్నది సమస్యగా మారింది. దీనికోసం ఆయన తన వద్ద ఉన్న టెస్లా వాటాల్లో ఓ 10 శాతం అమ్మాలనుకుంటున్నారట. అయితే, ఇది సరైన నిర్ణయమేనా? కాదా? అని ట్విట్టర్​లో (Elon Musk tweet tesla stocks) తన అనుచరులను అడిగారు. అందుకోసం ఏకంగా ఓ పోల్‌నే నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇది ముగుస్తుంది. కావాలంటే మీరూ ఇందులో పాల్గొని మస్క్‌కు సలహా ఇవ్వొచ్చు!

అత్యంత ధనవంతులపై పన్ను విధించాలంటూ అమెరికాలో డెమొక్రాటిక్‌ పార్టీ ప్రతిపాదించిన 'బిలియనీర్స్‌ ట్యాక్స్‌' విధానాన్ని (billionairs tax proposal) మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై అసహనంలో భాగంగానే.. పోల్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పోల్‌లో వచ్చిన ఫలితాలను తప్పకుండా స్వీకరిస్తానని మస్క్‌ తెలిపారు.

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సహా మరికొన్ని కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎలాన్‌ మస్క్‌ నగదు రూపంలో (Elon Musk on tax plan) జీతభత్యాలు తీసుకోరు. కేవలం స్టాక్‌ ఆప్షన్స్‌ మాత్రమే స్వీకరిస్తారు. అంటే రాయితీ ధరతో కూడిన స్టాక్సే ఆయన వేతనం. అలా ఆయన ఖాతాలో ఉన్న 22.86 మిలియన్ల టెస్లా స్టాక్‌ ఆప్షన్స్‌కు వచ్చే ఏడాది ఆగస్టు 13 నాటికి కాలం చెల్లనుంది. ఆలోపు ఆయన వాటిని ముందు నిర్ణయించిన 6.24 డాలర్లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వీటిపై వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం కింద లెక్కగడతారు. దీనిపై మస్క్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్లా స్టాక్‌ ధర రూ.1222.09 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ లెక్కన మస్క్‌కు భారీ ఎత్తున లాభం రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 30 నాటికి మస్క్‌కి టెస్లాలో 170.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం విక్రయిస్తే ఆయనకు 21 బిలియన్‌ డాలర్లు సమకూరే అవకాశం ఉంది.

ఈ ఏడాది టెస్లా వాటాల విలువ భారీగా పెరిగింది. అక్టోబరులో స్టాక్‌ ధర జీవితకాల గరిష్ఠాలకు చేరింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ సోదరుడు కింబల్‌ మస్క్‌ సహా టెస్లా బోర్డు సభ్యులు చాలా మంది తమ వాటాల్ని విక్రయించారు. మస్క్‌ మాత్రం అలా చేయకపోవడం గమనార్హం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలి బాధలను తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు కావాలని ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే వ్యాఖ్యలపై మస్క్‌ స్పందించిన విషయం తెలిసిందే. వారి ఆకలి బాధలు తీర్చేందుకు ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ఏజెన్సీకి ఇచ్చేందుకు తాను సిద్ధమే అని మస్క్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి:కుబేరులు దయతలిస్తే ప్రపంచ ఆకలి తీరుతుందా!

ABOUT THE AUTHOR

...view details