కరోనా వైరస్ ప్రభావం మన దేశంపై తక్కువగానే ఉండొచ్చని దిగ్గజ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీరు తమ విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకుంటుండగా, కొందరైతే రద్దు చేసుకుంటున్నారు. అలాగే ఉద్యోగులకు అవసరమైన నైతిక మద్దతు ఇస్తున్నారు.
'భారత్‌పై కరోనా వైరస్ ప్రభావం తక్కువే' - india ceos
భారత్‌పై కరోనా ప్రభావం భారీ స్థాయిలో ఉండే అవకాశం లేదని దిగ్గజ సంస్థల సీఈఓలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికారిక ప్రయాణాలు, సమావేశాలను పరిమితం చేసుకుంటున్నారు.
ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై, భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువగానే ఉండొచ్చనే ఆశావాదంతో ఉన్నారు సీఈఓలు. ఈ మహమ్మారిని మన దేశం సమర్థంగా ఎదుర్కోగలిగితే వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయని కొందరు సీఈఓలు తెలిపారు. ఒకవేళ ఆ వైరస్‌తో దీర్ఘకాల ముప్పు కొనసాగితే మాత్రం వినియోగదారు సెంటిమెంటు దెబ్బతిని, కొన్ని పరిశ్రమల వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించారు.
నెస్లే, హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్, టీవీఎస్, మారికో, యునైటెడ్ బ్రూవరీస్ వంటి కంపెనీలు తమ ఉన్నతాధికారుల విదేశీ ప్రయాణాల్ని పరిమితం చేసుకుంటున్నాయి. అయితే కరోనా ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుందని నెస్లే ఇండియా సీఈఓ సురేశ్ నారాయణన్ వెల్లడించారు.