కుబేరులు (Richest people in the world) అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వారి చదువు గురించి ఎప్పుడైనా వెతికారా? ప్రపంచంలోనే శ్రీమంతులుగా ఉన్న కొంతమంది విద్యార్హత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొంత మంది ఉన్నత చదువులు లేకుండానే రూ.లక్షల కోట్ల సామ్రాజ్యాలను నిర్మించారు. ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న కొంతమంది కుబేరుల విద్యార్హతలేంటో (Richest people Education Qualification) చూద్దాం!
జెఫ్ బెజోస్
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ 1994లో అమెజాన్ సంస్థను స్థాపించారు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసులోనే మెక్ డొనాల్డ్స్‌లో ఫ్రైకుక్‌గా పనిచేశారు. ఒకవైపు చదువుకుంటూనే పనిచేస్తూ గంటకు 2.69 డాలర్ల వరకు సంపాదించేవారు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ (Jeff Bezos net worth) 189.2 బిలియన్ డాలర్లు.
ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ 12 ఏళ్ల వయసులోనే స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ 'బ్లాస్టర్'కు కోడింగ్ చేశారు. దాన్ని పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్‌కు ఇవ్వగా పారితోషికంగా 500 డాలర్లు వచ్చాయి. ఇక ఈయన చదివింది కూడా బ్యాచిలర్ డిగ్రీయే. ఫిజిక్స్, ఎకానమిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ కోసం స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చేరినప్పటికీ.. రెండు రోజుల్లోనే మానేశారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ (Elon Musk wealth) 184.5 బిలియన్ డాలర్లు.
బెర్నార్డ్ అర్నాల్ట్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్‌కి పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద విలువ (Bernard Arnault net worth) 179.3 బిలియన్ డాలర్లు. ఇటలీకి చెందిన ఈయన ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ వెంటనే తండ్రి స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. కొన్నేళ్ల తర్వాత ఎల్‌వీఎంహెచ్‌లో పెట్టుబడులు పెట్టి.. తదనంతర కాలంలో దాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ కింద ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌లు ఉన్నాయి.
బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తొలుత హార్వర్డ్ యూనివర్సిటీలో 'లా' కోర్సులో చేరారు. కానీ, అదే వర్సిటీలో బోధించే కంప్యూటర్ సైన్స్, గణితంపై ఆసక్తితో ఆ కోర్సులను సొంతంగా అభ్యసించారు. అనంతరం 'లా' కోర్సును మధ్యలోనే వదిలేశారు. టెక్నాలజీ రంగంపై తనకున్న ఆసక్తితో అటువైపుగా అడుగులువేశారు. 1975లో పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ ఆస్తుల విలువ (Bill Gates net worth) 131.6 బిలియన్ డాలర్లు.