తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే - నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ఆర్థిక సర్వేను సభ్యుల ముందుకు తీసుకురానుంది కేంద్రం. మరి ఆర్థిక సర్వే అంటే ఏమిటి? దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం?

economic-survey-2020-21-to-be-tabled-on-parliament-today
నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే

By

Published : Jan 29, 2021, 5:43 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు శుక్రవారం (జనవరి 29న) పార్లమెంట్​ ఉభయ సభల్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక సర్వే అంటే?

ఆర్థిక సర్వే అనేది ఆర్థిక వ్యవస్థలో పలు రంగాల పరిస్థితిని తెలియచేస్తుంది. తద్వారా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు.. ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపైనా సూచనలు చేస్తుంది.

ఎవరు తయారు చేస్తారు?

ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ), ఆయన బృందం తయారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్‌కు ఒక రోజు ముందు దీనిని ప్రవేశపెడతారు. 1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వే తీసుకువచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత దీనిని విభజించి, విడిగా ఇస్తున్నారు.

ప్రభుత్వం అనుసరిస్తుందా?

ప్రభుత్వ పథకాలపై సీఈఏ అభిప్రాయాలు, వృద్ధికి అవసరమైన చర్యలపై సూచనలు ఇందులో ఉన్నప్పటికీ.. ఈ సిఫారసులను అనుసరించాలన్న నిబంధనేమీ లేదు. చాలా సందర్భాల్లో ఆర్థిక సర్వేలోని సూచనలు బడ్జెట్లో పాటించినట్లు కనిపించలేదు.

సర్వేలో ఉండే అంశాలు..

సాధారణంగా సర్వే రెండు విభాగాలుగా ఉంటుంది. తొలి భాగంలో కీలక అంశాలపై ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థపై స్థూలంగా సమీక్ష ఉంటుంది.

రెండో భాగంలో మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన గణాంకాలు ఉంటాయి. అయితే అన్నీ ఒకే రూపంలో (ఫార్మాట్‌) ఉండాలని లేదు. సీఈఏ అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.

సామాన్యులకు ఎందుకు?

పౌరులకు దేశ ఆర్థిక విధానాలపై అవగాహన పెంచేందుకు ఆర్థిక సర్వే ఉపయోగపడుతుంది. అటు గణాంకాలు, ఇటు విశ్లేషణల ద్వారా విస్తృత స్థాయిలో అందించే సమాచారం వల్ల ఆర్థిక స్థితి గురించి స్పష్టత లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details