అట్టడుగు వర్గాల్లోనూ సంపద సృష్టి జరిగేలా ఓ భారతీయ నమూనాను అభివృద్ధి చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆకాంక్షించారు. 3 దశాబ్దాల నుంచి అమలవుతున్న ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని ప్రజలందరికీ సమానంగా దక్కలేదని తెలిపారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఆర్థిక సంస్కరణల అమలు తీరుపై ముకేశ్ భావనలివీ..
సంస్కరణల వల్లే
దేశ ఆర్థిక వ్యవస్థ దిశ, గమ్యాన్ని మార్చేలా సాహసోపేత, దూరదృష్టితో కూడిన నిర్ణయాలను 1991లో భారత్ తీసుకుంది. నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రభుత్వ రంగానికి సమానంగా ప్రైవేట్ రంగానికి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కల్పించింది. లైసెన్స్ రాజ్‌కు చరమగీతం పాడింది. వాణిజ్య, పారిశ్రామిక విధానాలను సరళీకరించింది. కేపిటల్ మార్కెట్‌లు, ఆర్థిక రంగాల్లో సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు వ్యాపార సామర్థ్యాలను పెంపొందించే ఇంధనంగా ఉపయోగపడ్డాయి. వేగవంత వృద్ధి శకానికి నాంది పలికాయి. ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకూ ఇవి తోడ్పడ్డాయి. 1991లో 88 కోట్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 138 కోట్లకు పెరిగినప్పటికీ.. పేదరికం రేటు సగానికి సగం తగ్గిందంటే అది సంస్కరణల చలవే.
జీడీపీ 10 రెట్లు పెరిగింది
1991లో దేశ జీడీపీ 26,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటే, ఇప్పుడు 10 రెట్లకు మించి 2.87 లక్షల డాలర్ల స్థాయికి చేరింది. విదేశీ మారక ద్రవ్యం కోసం వెతుకులాడే పరిస్థితి నుంచి 61,200 కోట్ల డాలర్ల నిల్వలు ఏర్పడ్డాయి. 2051 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరూ సిరిసంపదలతో తులతూగేలా ఆర్థిక సమానత్వమున్న దేశంగా ఎదగడంపై ఇప్పుడు భారత్ దృష్టి పెట్టాలి.
ఎదురుచూపులకు చరమగీతం
కీలక మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పుడు మన దగ్గర ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయి. ఎన్నో పరిశ్రమలు, సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు టెలిఫోన్ లేదా గ్యాస్ కనెక్షన్ కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. కంపెనీలు ఒక కంప్యూటరు కొనాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు కోరుకున్న వెంటనే ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. నిజంగా ఆ సమయంలో ఇవన్నీ మాకు ఊహకు కూడా అందని మార్పులే.