తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: కుటుంబంలో ఇద్దరూ సంపాదిస్తుంటే..! - digital transformation

ఒకప్పుడు కుటుంబ పోషణ, నిర్వహణ అంటే పురుషులదే అనే భావన ఉండేది. కానీ, మారిన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఇందులో పాలుపంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని ఆర్థిక విషయాల్లోనూ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉండాలి. వారికి పూర్తి సమాచారం తెలియాలి. ఈ నేపథ్యంలో రెండు ఆదాయాలు ఉన్న కుటుంబాల్లో ఆర్థిక ప్రణాళికలకు మరింత ప్రాధాన్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ దిశగా ప్రయత్నాలు చేయకపోతే.. కనీసం ఇప్పటినుంచైనా భవిష్యత్తు కోసం మరింత కచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి.

EC gets silver award for govt process re-engineering for digital transformation
కుటుంబంలో ఇద్దరూ సంపాదిస్తుంటే

By

Published : Feb 18, 2020, 9:01 AM IST

Updated : Mar 1, 2020, 4:56 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో దంపతులిద్దరూ ఆర్జించడం సహజంగా మారింది. సంపాదన సరే... ఆర్థిక లక్ష్యాల సాధనకోసం ఇద్దరూ కలిసి కృషి చేస్తున్నారా? అంటే చాలామంది సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడతారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సాగే సంసారంలో ఆర్థిక విషయాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఎవరో ఒకరే డబ్బు నిర్వహణను చూస్తుంటారు. మరొకరు కేవలం విని ఊరుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రత చెక్కు చెదరకూడదు అనుకుంటే ఆర్జించే ఇద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించుకోవాల్సిందే. మరి ఇందుకోసం ఏం చేయాలి?

అవసరాలు ఏమిటి?

కుటుంబం అన్నప్పుడు కొన్ని అవసరాలుంటాయి. మరికొన్ని బాధ్యతలుంటాయి. ముందుగా చేయాల్సిన పని ఇద్దరూ కలిసి అవసరాలు, బాధ్యతల గురించి ఒక స్పష్టత ఏర్పరచుకోవడం. ఇద్దరూ కలిసి ఎంత సంపాదిస్తున్నారు? ఇంకా ఎన్నాళ్లపాటు పనిచేస్తారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానికి కావాల్సిన మొత్తం ఎంత? ఆ నిర్ణీత మొత్తాన్ని కూడబెట్టడానికి ఎవరు ఎంతెంత దాచి పెట్టాలి? ఎవరి సంపాదన ముందుగా ఆగిపోవచ్చు? మధ్యలో విరామం వచ్చే ఆస్కారం ఉందా? పదవీ విరమణ తర్వాత జీవితం కోసం ప్రణాళికలు వేసుకున్నారా? వీటన్నింటికీ అంత తొందరగా సమాధానాలు దొరకవు. అందుకే, కాస్త వీలు చూసుకొని వీటన్నింటిపైనా దృష్టి సారించాలి. లక్ష్యాలను నిర్ణయించుకుంటేనే ప్రణాళికలు రచించడం సులువు అవుతుంది. అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల నిపుణుడి సలహా తీసుకోండి. ఒకసారి లక్ష్యాల ప్రాధాన్యక్రమం తెలిస్తే వాటిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

మీరు ఎలాంటి వారు?

ఏ ఇద్దరు వ్యక్తుల మనస్తత్వం ఒకే రీతిగా ఉండకపోవచ్చు. డబ్బు విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దంపతుల్లో ఒకరికి డబ్బు గురించి చాలా శ్రద్ధ ఉండవచ్చు. మరొకరు అసలు పట్టించుకోకపోవచ్చు. దీనికి కారణం.. గతంలో వారికి డబ్బు విషయంలో ఎదురైన అనుభవాలే కావచ్చు. కొంతమందికి ఇతరులకు సంజాయిషీ చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ఇలాంటి వారు కూడా డబ్బు ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూడటానికి ఇష్టపడరు. కొంతమంది డబ్బు విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తారు. ఇలాంటివారే ఎక్కువగా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తుంటారు. కొంతమంది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఇంకొందరు ఆచితూచి రూపాయి రూపాయికీ లెక్కలేస్తుంటారు. కొంతమంది స్థిరాస్తులు, షేర్లులాంటి అధిక నష్టభయం ఉన్న వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జించే ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాదాయ పథకాల్లోనే పొదుపు చేయాలనే ఆలోచన మరికొందరిది. కాబట్టి, ముందుగా డబ్బు పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల విషయంలో మీరేమిటో ఒక అంచనాకు రావాలి. ఆ తర్వాతే ఎవరు డబ్బును నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఎలాంటి భేషజాలకూ తావీవకూడదు. అయితే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. డబ్బు లావాదేవీలు ఎవరు చూస్తున్నా.. రెండో వ్యక్తికి జవాబుదారీతనం వహించాల్సిందే.

ఉమ్మడి ఖాతా నుంచే...

ఉద్యోగం చేసే వారికి వేతన ఖాతాలుంటాయి. అయితే, ఇవి కాకుండా ఇద్దరూ కలిసి ఉమ్మడిగా రెండు ఖాతాలను ప్రారంభించాలి. ఇందులో ఒకటి పూర్తిగా ఖర్చులకు సంబంధించింది. మరోటి పెట్టుబడులకు సంబంధించింది. ఆదాయాలను బట్టి, ఎవరెవరు ఎంతెంత మొత్తం ఏయే ఖాతాలకు బదలాయించాలో నిర్ణయించుకోవాలి. ఒకసారి ఈ పద్ధతి నిర్ణయించుకున్నాక, డబ్బు నిర్వహణ మరింత సులువు అవుతుంది. అందువల్ల ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలపై స్పష్టత వస్తుంది. ఒకవేళ నెలవారీ ఖర్చులు పెరిగితే ఎంత పెరిగాయన్నదీ సులభంగా తెలుసుకోవచ్చు. మిగులు ఎంతో కూడా అంచనా వేయవచ్చు. ఆదాయపు పన్ను వర్తించే శ్లాబులను బట్టి, పెట్టుబడులను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

బీమా ఎంత?

ఆర్జించేవారికి తగిన మొత్తంలో జీవిత బీమా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరికీ బీమా ఉండాలి. ఇప్పటికీ మీకు బీమా పాలసీలు లేకపోతే వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ పాలసీ ఉండేలా చూసుకోండి. దీంతోపాటు ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడం కూడా విస్మరించొద్దు. వ్యక్తిగత ప్రమాద బీమా, వాహనాలు ఉంటే వాటికీ బీమా తీసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు పన్ను ఆదాకు కూడా సహకరిస్తాయి.

ఖర్చుల విషయంలో..

ఇద్దరూ సంపాదనపరులైతే ఆ ఇంట్లో ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇంట్లోకి కావాల్సిన ఉపకరణాల దగ్గర్నుంచీ, కారులాంటివి కూడా ఖరీదైనవే ఉండాలని కోరుకోవడం సహజమే. చాలా సందర్భాల్లో అవసరం కన్నా విలాసాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే, ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల అనుకున్న లక్ష్యాల సాధనకు వ్యవధి పెరుగుతుంది. కొత్త జంటలు నెల చివరికి వచ్చే సరికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని చెబుతుంటారు. జీతం పెరిగినా ఖర్చులకు సరిపోదు. ఎందుకంటే.. ఆదాయం పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా ఖర్చులూ పెరుగుతుంటాయి. నడి వయసులో ఉన్న వారికి వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం వారి పిల్లల చదువుల ఖర్చుకే వెళ్తుంది. అందుకే, ముందునుంచే ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి. పద్ధతి ప్రకారం ఖర్చు పెడుతూ వెళ్లాలి. వీలైనంత వరకూ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఖర్చు చేసే అలవాటు పెట్టుబడి అలవాటుగా మారినప్పుడే భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఏర్పడుతుంది.

ఆస్తులూ ఉమ్మడిగా...

ఒకసారి ఆర్థిక ప్రణాళిక పూర్తయిన తర్వాత ఎవరెవరు ఎలా పెట్టుబడులు పెట్టాలన్నది నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత పెట్టుబడులన్నీ కూడా ఉమ్మడిగా ఉండేలా చూసుకోవడం మంచిది. రుణం తీసుకొని ఇల్లు, ఇతర ఆస్తులు కొన్నప్పుడు రుణ వాయిదాలు ఎవరు ఎంత నిష్పత్తిలో చెల్లిస్తున్నారన్నదాన్ని బట్టి హక్కులు ఉండేలా చూసుకోండి. ఇద్దరూ ఆర్జిస్తున్నప్పుడు ఒకరి సంపాదన పూర్తిగా ఖర్చులకు కేటాయించడం, మరొకరి డబ్బుతో పెట్టుబడులు పెట్టడం చూస్తూనే ఉంటాం. దీనివల్ల భవిష్యత్తులో ఆస్తులను విక్రయించినప్పుడు లేదా రాబడి వచ్చినప్పుడు పన్నుపరమైన ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంది. కొన్ని ఇతర అంశాలమీదా దీని ప్రభావం ఉంటుంది. ఇద్దరూ యాజమానులుగా ఉండటం వల్ల ఒకరకమైన భద్రతా కలిగిస్తుంది. ఇద్దరూ కలిసి నెలసరి వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరి ఆదాయం ఆగిపోతే అదనపు భారాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో కూడా ముందే నిర్ణయించుకొని ఉండటం ఉత్తమం.

ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. దీనికి కొంత సమయంతోపాటు, అంకితభావం కూడా ముఖ్యమే.ఇద్దరూ ఆర్జిస్తున్నప్పుడు ఖాళీ సమయం దొరకడం కొంచెం కష్టమే. కానీ, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూడు నెలలకోసారైనా కొంత సమయాన్ని కేటాయించి, ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకోవడం అవసరం. అప్పుడే మీ సంపాదనతో కుటుంబం ఉన్నత స్థితికి చేరుతుంది.

Last Updated : Mar 1, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details