పసిడి ధరలు గతేడాది గరిష్ఠస్థాయుల నుంచి గణనీయంగా తగ్గినందున, ఆభరణాల గిరాకీలో వృద్ధి కొనసాగుతుందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేస్తోంది. 2020-21తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30-35 శాతం మేర గిరాకీ పెరగొచ్చని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్-19 ముందు స్థాయులకు చేరడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. పండుగ సీజనుకు తోడు వివాహాది శుభకార్యాలు జరగడం, గరిష్ఠ స్థాయి నుంచి బంగారం ధర 10 శాతం మేర తగ్గడంతో గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆభరణాలకు గిరాకీ బలంగా పుంజుకుందని అభిప్రాయపడింది. ఆభరణాల రంగం రేటింగ్‌ను 'స్థిరత్వం- ప్రతికూలం' నుంచి స్థిరత్వానికి సవరించింది. కొవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల కారణంగా గిరాకీ గణనీయంగా పడిపోవడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2021-22లో గిరాకీలో బలంగా పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. పసిడి ధరలు మరింత తగ్గుతుండటం కలిసిరావచ్చని తెలిపింది. అయితే 2019-20తో పోలిస్తే 2021-22 గిరాకీలో వృద్ధి 5-10 శాతమే ఉండొచ్చని వెల్లడించింది.
పెరిగిన నిర్వహణ మార్జిన్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో దిగ్గజ ఆభరణాల విక్రయ సంస్థల నిర్వహణ మార్జిన్లు 7.7% పెరిగాయని, 2019-20 ఇదే సమయంలో ఇది 5.9 శాతమేనని నివేదిక పేర్కొంది. ప్రచారాల వ్యయాలు తగ్గడం ఇందుకు తోడ్పడిందని తెలిపింది. అద్దె సహా నిర్వహణ వ్యయాలు తగ్గడం 2021-22లో మార్జిన్ల వృద్ధికి దోహదం చేయొచ్చని పేర్కొంది. 2019-20 స్థాయితో పోల్చినా 25-50 బేసిస్ పాయింట్ల మేర మార్జిన్లు పెరగొచ్చని నివేదిక అంచనా వేసింది. చాలా సంస్థలు కొత్త విక్రయ కేంద్రాల ప్రారంభాన్ని 2022-23కి వాయిదా వేసుకున్నాయని, తక్కువ లాభదాయకత ఉన్న విక్రయకేంద్రాలను విలీనం చేస్తున్నాయని తెలిపింది. గిరాకీ పుంజుకోడానికి తోడు కొత్త విక్రయకేంద్రాలను పెద్దగా ప్రారంభించరు కనుక 2021-22లో ఆభరణాల రంగానికి వ్యయాల రూపేణ కలిసొస్తుందని పేర్కొంది.